Rouse Avenue Court Judicial Custody To Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (Mlc Kavitha) షాక్ తగిలింది. రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) ఆమెకు ఈ నెల 23 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించాలని సీబీఐ కోరగా.. 9 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. లిక్కర్ కేసులో (Delhi Liquor Case) మనీ లాండరింగ్ కు సంబంధించి ఈడీ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టులో హాజరు పరచగా 3 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈ క్రమంలో కవితను సీబీఐ ప్రశ్నించిన అనంతరం గడువు ముగియడంతో సోమవారం కోర్టులో హాజరు పరిచారు. దీంతో జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించనున్నారు.






సీబీఐ వాదన ఇదే


3 రోజుల కస్టడీ ముగిసిన అనంతరం సోమవారం కవితను సీబీఐ అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు ప్రవేశపెట్టారు. ఈ సమయంలో సీబీఐ తన వాదనలను వినిపించింది. 'సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించాం. ఆమెకు విచారణకు సహకరించడం లేదు. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న రూ. 14 కోట్ల వ్యవహారంపై కవితను ప్రశ్నించాం. ఉద్దేశ పూర్వకంగా తప్పుదోవ పట్టించేలా కవిత సమాధానాలు చెప్పారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్ తో జరిగిన సమావేశాలపై ప్రశ్నించాం. ఆమె విచారణను, సాక్షులను ప్రభావితం చేయగలిగిన పలుకుబడి కలిగిన వ్యక్తి. కేసుకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేయడంతో పాటు, చెరిపేసే అవకాశం ఉంది. కేసుకు సంబంధించి డిజిటల్ పరికరాలను, డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమెను విచారించేందుకు మరింత సమయం కావాలి.' అని కోర్టును కోరింది. అందుకోసం మరో 14 రోజులు కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరగా.. 9 రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో కోర్టు ఈ నెల 23 వరకూ కస్టడీ పొడిగించింది.


'ఇది బీజేపీ కస్టడీ'






మరోవైపు, కోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో కవిత సీబీఐపై ఆరోపణలు చేశారు. ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని విమర్శించారు. 'సీబీఐ అధికారులు రెండేళ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారు. బయట బీజేపీ వాళ్లు మాట్లాడేదే.. లోపల సీబీఐ వాళ్లు అడుగుతున్నారు. ఇందులో కొత్తది ఏమీ లేదు.' అని అసహనం వ్యక్తం చేశారు.


కవితపై న్యాయమూర్తి ఆగ్రహం


ఈ నేపథ్యంలో కవితపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోసారి అలా మాట్లాడవద్దంటూ హెచ్చరించారు. జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినా ఎలా మాట్లాడుతారంటూ అసహనం వ్యక్తం చేశారు.


Also Read: KTR met MLC Kavitha: ఢిల్లీలో ఎమ్మెల్సీ కవితను కలిసి ధైర్యం చెప్పిన కేటీఆర్