KTR met MLC Kavitha CBI headquarters in Delhi- న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ స్కామ్‌లో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆమె సోదరుడు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. ఈడీ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ అధికారులు ఇటీవల అరెస్ట్ చేయడం తెలిసిందే. తమ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఆదివారం రెండో రోజు ఢిల్లీలోని తమ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించారు. 




ఆదివారం (ఫిబ్రవరి 14న) సాయంత్రం 6 గంటలకు కవిత సీబీఐ విచారణ ముగిసింది. ప్రస్తుతం మూడు రోజుల సీబీఐ కస్టడీలో ఉన్న కవితను కలిసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఢిల్లీకి వెళ్లారు. కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సీబీఐ కేంద్ర కార్యాలయంలో కవితను కలిసి ధైర్యం చెప్పారు. న్యాయం తమవైపే ఉందని, అధైర్యపడవద్దని కవితకు సోదరుడు కేటీఆర్ ధైర్యం చెప్పారు. సోమవారం సీబీఐ కస్టడీ ముగియనుండటంతో మంగళవారం ఉదయం 10 గంటలకు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నారు. కవిత కస్టడీ పొడిగించాలని సీబీఐ తరఫు లాయర్లు కోర్టును కోరనున్నారు.  


కవిత పిటిషన్లు తోసిపుచ్చిన న్యాయస్థానం
ఎమ్మెల్సీ కవితను 3 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. అంతకు ముందు ఆమె దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ తనను ప్రశ్నించడాన్ని, అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత పిటిషన్లు దాఖలు చేశారు. అడిగిన ప్రశ్నలనే సీబీఐ మళ్లీ మళ్లీ అడుగుతోందని, తనను కస్టడీకి ఇవ్వొద్దని కోరారు. కానీ సీబీఐ వాదనలతో ఏకీభవించిన రౌస్ అవెన్యూ కోర్టు ఆమెను 3 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్‌ కు వచ్చి ఆమెను అరెస్ట్ చేయడం తెలిసిందే. ఆమె కస్టడీని ఇప్పటికే మూడు సార్లు పొడిగించింది కోర్టు. కవిత రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 16న (మంగళవారం) విచారణ జరగనుంది.