BRS MLC Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఇప్పట్లో బయటకు వచ్చే సూచనలు కనిపించడం లేదు. తాజాగా ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూ ఈరోజు (జూలై 26) మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. అటు ఈడీ కేసులో కవిత రిమాండ్‌ను ఈ నెల 31 వరకు న్యాయస్థానం పొడిగించింది.


మరోవైపు సీబీఐ కేసులోనూ.. గురువారం (జులై 25) రాత్రి న్యాయమూర్తి కావేరీ బవేజా వాదనలు విన్నారు. సీబీఐ కేసులో కూడా కవిత జ్యుడిషియల్ రిమాండ్‌ను ఆగస్టు 8 వరకు పొడిగించారు. తీహార్ జైలు నుంచి కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. కల్వకుంట్ల కవితతో పాటు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కోర్టు ముందు హాజరుపరిచారు.


సీబీఐ కేసులో డీఫాల్ట్‌ బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కవిత వేసిన పిటిషన్ పై జులై 22న రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ వద్ద బలమైన సాక్ష్యాలు ఉండడంతో కవిత బెయిల్ పిటిషన్లు తిరస్కర ణకు గురవుతున్నాయని అంటున్నారు.


ఆగస్టు 5న విచారణ
ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన అడిషనల్ చార్జిషీట్‌ సరిగా లేదని బెయిల్‌ కోసం కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణను ఆగస్టు 5కు రౌస్‌ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. సీబీఐ అదనపు చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు వెల్లడిస్తూ.. దీనిపై ఈ నెల 26న విచారణ చేపడతామని న్యాయమూర్తి కావేరీ భవేజా వెల్లడించారు. ఆ రోజు కవితను వర్చువల్‌గా హాజరుపర్చాలని ఆదేశించగా.. కవితను నేడు వర్చువల్ గా హాజరుపర్చారు.



ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఈడీ మార్చి 15న ఇదే కేసులో అరెస్టు చేసింది. అయితే, ఈడీ కస్టడీలో ఉండగానే కవితను సీబీఐ కూడా అదుపులోకి తీసుకుంది. 3 రోజుల రిమాండ్ అనంతరం ఏప్రిల్ 15 నుంచి జుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉంటున్నారు. 


ఈ మధ్య కల్వకుంట్ల కవిత అనారోగ్యానికి గురైనట్లు, ఆమెను దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ హాస్పిటల్‌కు తరలించినట్లుగా కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె జ్వరం, లో బీపీతో బాధపడుతున్నట్టు జైలు అధికారులు తెలిపారు. అంతేకాక, కవిత దాదాపు 10 కిలోల బరువు తగ్గినట్లుగా కూడా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.