Review meeting on Telangana Assembly Budget Sessions: హైదరాబాద్: ఫిబ్రవరి 8వ తేదీ (గురువారం) నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల (Telangana Budget Session 2024) నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై శాసన సభ మీటింగ్ హాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు.


శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు త్వరితగతిన అందించాలని సూచించారు. సమావేశాల సమయంలో సంబంధిత అధికారులు తప్పకుండా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మండలి షిఫ్టింగ్ త్వరగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకునేలా శాసన సభ వ్యవహారాల మంత్రి తోడ్పాటు అందించాలని గుత్తా కోరారు. భద్రత, రక్షణ వ్యవహారాల విషయంలో పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో ధర్నాలు, ర్యాలీల అనుమతి విషయంలో ఆచితూచి చర్యలు చేపట్టాలని సూచించారు.


ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమావేశాలు నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పట్లు ఆయా విభాగాల అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని అధికారులను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. సభ్యుల ప్రశ్నలకు సాధ్యమైనంత త్వరగా సమాధానాలు ఇవ్వాలని సూచించారు. డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో మంత్రులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అసెంబ్లీ కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మండలి, శాసన సభకు ఎన్నికైన నూతన సభ్యులకి ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించాలన్నారు. 


శాసన సభ సమావేశాల సమయంలో అన్ని విభాగాలను కోఆర్డినేట్ చేసేందుకు, త్వరితగతిన సమాధానాలు సభ్యులకు అందించేందుకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఈ సమావేశాల్లో మంత్రులకు సబ్జెక్టుల వారీగా బాధ్యతలు ఇస్తున్నామని, సభ్యుల ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ కు సూచించారు. ప్రోటోకాల్ విషయంలో తప్పిదాలు జరగవద్దని, గతంలో ప్రోటోకాల్ విషయంలో తాను కూడా బాధితుడిని అని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేసుకున్నారు. 


మండలిని అసెంబ్లీ ప్రాంగణంలో కు త్వరితగతిన షిఫ్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకా ఏమైనా సమస్యలుంటే వెంటనే పరిష్కారం చెయ్యాలని చీఫ్ సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. కొత్త సభ్యుల కోసం సమావేశాల తర్వాత రెండు రోజుల ఓరియంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, భద్రతపై సమక్షలో.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చార్యులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రామకృష్ణ రావు, డీజీపీ రవి గుప్త, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, ముగ్గురు పోలీస్ కమిషనర్లు, ఇతర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.