Ram Lalla Idol: అచ్చం అయోధ్య బాల రాముడి విగ్రహాన్ని పోలిన విగ్రహాన్ని కర్ణాటకలోని రాయ్‌చూర్‌లో కనుగొన్నారు. మొత్తం దశావతారాలతో కూడిన విష్ణుమూర్తి విగ్రహం దాదాపు అయోధ్య రాముడినే పోలి ఉండడం ఆసక్తికరంగా మారింది. దీంతో పాటు ఓ శివలింగమూ బయటపడింది. రాయ్‌చూర్‌లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో ఇవి వెలుగులోకి వచ్చాయి. ఈ రెండూ 11 లేదా 12వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు పురావస్తు శాఖ అధికారులు. విష్ణుమూర్తి విగ్రహాన్ని కృష్ణా నదీ తీరంలో కనుగొన్నారు. అక్కడే శివలింగమూ బయట పడింది. స్థానికుల్లోనూ ఈ ఘటన ఆసక్తి కలిగించింది.
"బహుశా ఈ శివలింగం, విష్ణుమూర్తి విగ్రహం 11 లేదా 12వ శతాబ్దానికి చెందినవై ఉండాలి. ఈ రెండు విగ్రహాలూ ఆయా ఆలయాల్లోని గర్భగుడుల్లో ఉండి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నాం. ఇక్కడి ఆలయం నీటిలో మునిగిపోయి ఉండొచ్చు"
- పురావస్తుశాఖ అధికారులు
శంఖుచక్రాలతో ఉన్న విష్ణుమూర్తి విగ్రహంపై దశావతారాలు చెక్కి ఉన్నాయి. వేదాల్లో వేంకటేశ్వరస్వామిని వర్ణించినట్టుగానే ఈ విష్ణుమూర్తి విగ్రహం ఉందని అధికారులు వెల్లడించారు. అయితే...ఇక్కడ గరుడ విగ్రహం మాత్రం కనిపించలేదని తెలిపారు.
యోగిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
అయోధ్య రాముడి విగ్రహాన్ని (Ayodhya Ram Lalla Idol) చెక్కిన అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj) ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ప్రతిష్ఠించిన సమయంలో చూస్తే అసలు ఆ విగ్రహాన్ని చెక్కింది తానేనా అని ఆశ్చర్యపోయానని చెప్పాడు. అలంకరణ తరవాత అంత ఆ రామయ్య విగ్రహానికి అంత అందం వస్తుందని ఊహించలేదని అన్నాడు. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తరవాత ఏదో తెలియని అందం అందులోకి వచ్చి చేరిందని ఆనందం వ్యక్తం చేశాడు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
"ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తరవాత బాల రాముడి విగ్రహం రూపు రేఖలే మారిపోయాయి. అసలు తయారు చేసింది నేనేనా అని నాకే అనుమానం వచ్చింది. అలంకరణ తరవాత రామయ్య స్వరూపమే మారిపోయింది. చెక్కుతున్న సమయంలోనే ఒక్కో దశలో ఒక్కో విధంగా కనిపించింది. కానీ ఆభరణాలతో అలంకరించిన తరవాతే మొత్తం రూపురేఖలు మారిపోయాయి"
- అరుణ్ యోగిరాజ్, రామ్‌లల్లా విగ్రహ శిల్పి