Congress dharna against BC reservations at Jantar Mantar: బీసీ రిజర్వేషన్లను ప్రధాని మోదీ, బీజేపీ అడ్డుకుంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జంతర్ మంతర్ లో బీసీ బిల్లును ఆమోదించాలంటూ రేవంత్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఇందులో ప్రసంగించిన రేవంత్ రెడ్డి కేంద్రంతో పాటు కేటీఆర్ పైనా విరుచుకుపడ్డారు. కేసీఆర్ బలహీన వర్గాల పై కక్ష కట్టి రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చట్టం తెచ్చారు. ఆ చట్టం ప్రస్తుతం స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు పెంచకుండా నిషేధం విధించింది. ఆ చట్టం వల్లే ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు.
రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీ చేసిన చట్టాలను ఆమోదించకుండా తాత్సారం చేస్తున్నారని.. కేంద్రం మెడలు వంచడానికి జంతర్ మంతర్ వేదికగా ధర్నా చేస్తున్నామని రేవంత్ ప్రకటించారు. దేశంలో కీలక రాజకీయ పార్టీల మద్దతు కోసం, వారి దృష్టికి తెలంగాణ బీసీల సమస్యను తీసుకురావడానికి ఇక్కడ ధర్నా చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో చేస్తే అతి తెలంగాణకే పరిమితమవుతుందని ఇప్పుడు ధర్నా గురించి దేశం మొత్తం చర్చిస్తోందన్నారు. మోదీని గద్దె దించుతాం ..రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని ప్రకటించారు.
దేశంలో ఇండియా కూటమి పార్టీలు మనకు అండగా నిలబడ్డారు... 42 శాతం బీసీ రిజర్వేషన్లు రాహుల్ గాంధీ పాదయాత్రలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ అని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం, కేంద్రం వంద సంవత్సరాలలో కులగణన చెయ్యలేదన్నారు. దేశంలో ఇప్పటివరకు ఉన్న 300 మంది ముఖ్యమంత్రులు చేయలేని పనిని మా మంత్రివర్గం చేసిందని.. తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి గా బీసీ రిజర్వేషన్లు పెంచే అవకాశం నాకు వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ లకు అడ్డుపడ్డ కేసీఆర్, బండి సంజయ్, రామచందర్ రావు లేనన్నారు. దేశ ప్రధాని మోడికి సవాల్ విసురుతున్నాను. మీరు బీసీలకు అన్యాయం చేస్తే గద్దె దించుతాం... రాహుల్ గాంధీ ని ప్రధాని చేసి మా డిమాండ్ సాధించుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ ప్రజలు గుజరాత్ లో భూములు, ఆస్తులు అడగడం లేదు. బలహీన వర్గాలకు అన్యాయం మోడి చేస్తున్నారు. ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు తెలంగాణ బీసీల అవసరం లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ధర్నాకు రాలేదో చెప్పాలన్నారు. కేటీఆర్ ఒక డ్రామా రావు, బీసీ ధర్నా ఆయనకు ఒక డ్రామా లాగా అనిపిస్తోంది. కేసీఆర్ కుటుంబం డ్రామాలతో బతుకుతున్నదని.. కేటీఆర్ బుద్ధి మారలేదు, అహంకారం తగ్గలేదన్నారు. అటూ , ఇటూ కాని వాళ్లు కూడా నా గురించి మాట్లాడుతున్నారు. మోహన్ భగవత్ చెప్పినట్లు సెప్టెంబర్ 17న మోడి ప్రధాని పదవి నుండి దిగాలని డిమాండ్ చేశారు.
2029 ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ చేయలేని పనిని రాహుల్ గాంధీ చేసి చూపిస్తారు. మోడిని గద్దె నుండి దింపుతాం. ఇదే జంతర్ మంతర్ వేదికగా మా శపథం చేస్తున్నామన్నారు. 2029 ఎన్నికలో బిజెపికి 150 కంటే ఒక్క సీటు ఎక్కువగా రావని.. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే, తెలంగాణ ప్రజల శక్తిని తక్కువగా అంచనా వేసే మోడీకి మా తడాఖా చూపిస్తామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ అప్పుడు దళితుల , గిరిజనుల విషయంలో ఒక దేవతగా నిలిచారని.. దేశంలో ఐటీ విప్లవం సృష్టించిన రాజీవ్ గాంధీ ఫలాలు నేడు చాలా మంది దేశ విదేశాల్లో అనుభవిస్తున్నారని తెలిపారు. రాహుల్ గాందీ మహత్తర ఆశయాలకు అడ్డు తగిలితే అడ్రస్ లేకుండా పోతారని హెచ్చరించారు. *మోడికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లులను తక్షణమే ఆమోదించాలన్నారు.