అడవుల ఖిల్లా నుండే ఎన్నికల శంఖరావం పూరించేందుకు టీపీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి రేపు ఆదిలాబాద్‌కు వస్తున్నారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ బస్టాండు మైదానంలో ముందుగా ఖానాపూర్ నియోజకవర్గ అభ్యర్థి వెడ్మ బొజ్జు కు మద్దతుగా ఎర్పాటు చేసిన సభలో పాల్గొననున్నారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. విజయభేరి మోగించి పార్టీ క్యాడర్‌లో నూతనోత్సాహం నింపనున్నారు. ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఆ పనులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్తులు, వెడ్మ బొజ్జు, కంది శ్రీనివాసరెడ్డి లతో పాటు పార్టీ సీనియర్ నాయకులు పరిశీలించారు. క్యాడర్‌కు తగిన సూచనలు చేశారు. దాదాపు ఈ రెండు సభల్లో ఒక్కో సభకు 30 వేల వరకు జనసమీకరణ చేపట్టి సభను విజయవంతం చేసేలా పార్టీ క్యాడరంతా కృషి చేస్తోంది.
ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. రేపు రేవంత్‌రెడ్డి జన్మదినం కావడంతో ఆయన బర్త్‌డే వేడుకలను సైతం సభా వేదికపై ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి, అటు ఖానాపూర్ నియోజకవర్గంలో వెడ్మ బోజ్జు, ఆదిలాబాద్ నియోజకవర్గంలో కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభకు రానుండడంతో క్యాడర్‌లో పుల్ జోష్ కన్పిస్తోంది. జిల్లా కేంద్రంలో సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలో రేపు ఎన్నికల ప్రచారంలో భాగంగా, అటు నామినేషన్లు వేస్తున్న సందర్భంగాను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వస్తున్నారని, ఖానాపూర్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా ఉట్నూర్, ఆదిలాబాద్ లో నిర్వహించే బహిరంగ సభలను కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయాలన్నారు.