Revanth Reddy challenges KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి అంటే అల్లాటప్పా అనుకోవద్దని.. కేటీఆర్ తరహాలో తండ్రి పేరు చెప్పుకొని పదవిలో కూర్చున్న వ్యక్తిని కాదని అన్నారు. కార్యకర్త స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగానని అన్నారు. చంచల్‌గూడ జైలులో పెట్టినా తాను అధైర్యపడకుండా పోరాటం చేశానని గుర్తు చేశారు. లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో ‘జనజాతర’ పేరుతో ఓ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేటీఆర్ కు సవాలు విసిరారు.


చేవెళ్ల సభ నుంచి తాను సవాల్‌ విసురుతున్నానని అన్నారు. దమ్ముంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ కు ఒక్క సీటయినా గెలిపించి చూపించాలని ఛాలెంజ్ చేశారు. రేవంత్‌ పేరు చెబితే 3 సీట్లు కూడా వచ్చేవి కావని గతంలో కేటీఆర్‌ అన్న విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. కేసీఆర్ మనిషా మానవ రూపంలో ఉన్న మృగమా? అని సూటిగా ప్రశ్నించారు.




వాళ్ల చెమటతోనే గెలిచాం
కార్యకర్తల చెమటతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రేవంత్‌ రెడ్డి అన్నారు. వారి త్యాగం తాము ఎన్నటికీ మర్చిపోనని చెప్పారు.  తనను కార్యకర్తలు భుజాలపై మోసినంత కాలం తనను, తన కూర్చీని ఎవరు తాకలేరని మందలించారు. సెప్టెంబర్ 17న ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీకి ఇచ్చిన మాటను నెరవేరుస్తామని చెప్పారు. తాము తొలుత చెప్పినట్లుగానే ఏడాది వ్యవధిలో నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరతామని చెప్పారు. రాబోయే మార్చి 2వ తేదీన మరికొన్ని ఉద్యోగాలు ప్రకటిస్తామని వెల్లడించారు. త్వరలోనే మెగా డీఎస్సీ ప్రకటన ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తుంటే కనీసం బీఆర్ఎస్ నేతలు అభినందించారా అని అడిగారు.


కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని తరచూ బీఆర్ఎస్ నేతలు అంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం కూలిపోతుందనే బీఆర్ఎస్ నేతలను వేప చెట్టుకు కట్టేసి.. వారి లాగులో తొండలు వదలండి అంటూ హెచ్చరించారు. దమ్ముంటే ఒక్క సీటు గెలిచి చూపాలని అన్నారు.