Telangana Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్(Congress) నేతల ఆశలపై అధిష్ఠానం నీళ్లు చల్లింది. మంత్రివర్గ కేటాయింపుపై ఏకాభిప్రాయం కుదరనందున ఇప్పుడప్పుడే  కొత్త అమాత్యులకు చోటు లేదని కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్లు సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తేల్చిచెప్పారు. ఎప్పుడనేది కూడా ఇప్పుడే చెప్పలేమన్నారన్నారు. మీడియాతో ఇష్టాగోష్టిగా  మాట్లాడిన రేవంత్‌...పలు అంశాలపై చర్చించారు. కేటీఆర్‌(KTR), హరీశ్‌రావు(Harishrao) అరెస్ట్‌కు ఇప్పుడే తొందరలేదన్న ఆయన... ప్రధాని మోదీ ఓబీసీనే కాదని....నాడు సీఎం పదవిని అడ్డుపెట్టుకుని  ఓబీసీ హోదా సంపాదించారన్నారు.
 
కులగణనకు చట్టబద్ధత తెస్తాం
దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ(Telangana)లో కులగణన (Cast Census) పకడ్బందీగా  చేపట్టామని...ఏ ఒక్క వర్గం నుంచి వ్యతిరేకత ఎదురవ్వకుండా చరిత్రలో ఇంత శాస్త్రీయంగా కులగణన చేపట్టినవారు ఎవరూ లేరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కులగణనకు చట్టబద్ధత కల్పిస్తామని ఆయన ప్రకటించారు. గతంలో బీఆర్‌ఎస్‌(BRS) హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ముస్లింలతో కలుపుకుని ఓబీసీలు 51శాతం ఉంటే ఇప్పుడు 56 శాతానికి పైగా పెరిగింది.  గతంలో 21శాతం ఉన్న ఓసీ(OC)ల సంఖ్య 15శాతానికి పడిపోయింది. ఇంత శాస్త్రీయంగా లెక్కలు ఉన్నా....విపక్షాలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.క్రైస్తవులు అన్ని వర్గాల్లో ఉన్నారు కాబట్టి వారిని...జైన్‌లు,సిక్కులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు కాబాట్టి వారిని ప్రత్యేకవర్గంగా లెక్కకట్టలేదని సీఎం తెలిపారు.
 
ప్రధాని మోడీ బీసీ కాదు
ముఖ్యమంత్రి పీఠాన్ని ఓబీసీ(OBC)లకు ఇవ్వాలని డిమాండ్ చేసే హక్కు,అర్హత రెండూ బీజేపీ(BJP)కి లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దిల్లీలో అధిష్టాన పెద్దలను కలిసిన  అనంతరం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సీఎం....సీఎం పీఠం బీసీలకు ఇవ్వాలంటున్న బీజేపీ..రెండు తెలుగురాష్ట్రాల్లో వారి అధ్యక్షులను మాత్రం అగ్రవర్ణాలకు కట్టబెట్టిందన్నారు. బీసీలను తప్పించి మరీ చేజిక్కించుకున్నారన్నారు. బీసీలైన బండి సంజయ్‌ అధ్యక్ష పదవిని, సికింద్రాబాద్‌ నుంచి ఎప్పుడూ గెలుపొందే  దత్తాత్రేయ నుంచి లోక్‌సభ స్థానాన్ని లాగేసుకున్నది కిషన్‌రెడ్డేనన్నారు. బీజేపీ శాశనసభాపక్షం నేత మహేశ్వర్‌రెడ్డిని కూడా కిషన్‌రెడ్డే(Kishan Reddy) నియమించారని సీఎం గుర్తు చేశారు. వాళ్లు పదేపదే చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా  ఓబీసీ కాదని... నాడు ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆయన కన్వర్ట్ అయ్యారన్నారు. 2001 వరకు అగ్రవర్ణాల్లో ఉన్న ఆయన కులాన్ని ఆయన సీఎం అయిన తర్వాత బీసీల్లో కలిపారని గుర్తు చేశారు.
 
ముస్లింలకు న్యాయం
ముస్లింలకు   4శాతం రిజర్వేషన్లు ఉన్నా  వారి సంఖ్య ఖచ్చితంగా లేకపోవడం వల్ల ఈ రిజర్వేషన్ల అంశంలో సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని...ఇప్పుడు కులగణన ద్వారా ముస్లింల సంఖ్య తేల్చడంతో ఈ లెక్కలు కోర్టుకు సమర్పిస్తే...వారికి న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్ ఫలాలు అందుతాయన్నారు. తాజా లెక్కల ప్రకారం ముస్లింలలో 10.08శాతం ఓబీసీలు ఉన్నా...వారికి బీసీ-ఈ  కిందఇచ్చిన 4శాతం రిజర్వేషన్ మాత్రమే వర్తిస్తుందని...అందువల్ల ఓబీసీలు భయపడాల్సిన పనిలేదని సీఎం తెలిపారు. గతంలో బీఆర్‌ఎస్‌ హయంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే మొత్తం తప్పుల తడకన్న సీఎం రేవంత్‌రెడ్డి....ఎస్సీ ఉపకులాలు 82 ఉన్నట్లు తప్పుడు లెక్కలు చెప్పారని వాస్తవంగా ఉన్నది 59 అన్నారు.  ఎలాంటి తప్పులు తలెత్తకుండా శాస్త్రీయంగా  సర్వే చేయడం వల్లే 50 రోజులు పట్టిందన్నారు. ఈ కులగణనకు త్వరలోనే చట్టబద్ధత తీసుకొస్తామన్నారు. అలాగే  ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన నివేదికను యథాతథంగా అమలు చేశాం తప్ప....ఇందులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఏమీలేదన్నారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడం ఇప్పుడప్పుడే సాధ్యం కాదని...ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మినహాయించిన తర్వాత 50 శాతం లోపు మిగిలిన రిజర్వేషన్ల ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినందున బీసీలకు ఇవ్వలేమన్నారు.  50 శాతానికి మించి రిజర్వేషన్లు  ఇవ్వాలంటే  మాత్రం రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనన్నారు. అందుకే మేం పార్టీ తరఫున ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పలేదని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. బీసీ కులగణనపై మండల,జిల్లా,రాష్ట్రస్థాయిలో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. కాంగ్రెస్ అధిష్ఠానం అమోదం తర్వాతే కులగణన చేపట్టామన్నారు.
 
కేటీఆర్‌,హరీష్‌ అరెస్ట్‌ ఇప్పుడే కాదు
బీఆర్ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌ను అరెస్ట్‌ చేయాలన్న తొందరేమీ తనకు లేదని రేవంత్‌రెడ్డి తెలిపారు. వ్యవస్థలన్నీ చట్టప్రకారం తమ పని తాము చేసుకుంటూపోతాయన్నారు.