Revanth Reddy On Basavatarakm Hospital :   తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్ ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 24వ వార్షికోత్సవంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో  హెల్త్ టూరిజం హబ్ గురించి ప్రకటించారు.  అన్ని రకాల వైద్య సేవలు అందేలా హెల్త్ టూరిజం హబ్ ఉంటుందన్నారు.  ఇందులో బసవతారకం ఆసుపత్రికి చోటు ఖచ్చితంగా ఉంటుందని..  
వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు.  ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా  హైదరాబాద్ కు వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందుతాయనేలా తీర్చిదిద్దుతామన్నారు. 


పేదలకు క్యాన్సర్ వైద్యం అందిస్తున్న బసవతారకం ఆస్పత్రి 
 
ఎన్టీఆర్ ఆలోచనతో ఏర్పడ్డ ఈ ఆసుపత్రి 24 ఏళ్లుగా కోట్లాది మందికి సేవలందించడం సంతోషమని రేవంత్ రెడ్డి అన్నారు.  పేదలకు సేవలందించే ఉద్దేశంతో ఆనాడు ఎన్టీఆర్ ఈ ఆసుపత్రి నిర్మాణం చేశారన్నారు.  ఎన్టీఆర్ ఆలోచన విధానాలను కొనసాగించాలని చంద్రబాబు నాయుడు ఆసుపత్రిని పూర్తి చేసి పేదలకు సేవలు అందించేలా చేశారని అభినందించారు.  పేదలకు వైద్య సేవలు అందించాలన్న ఎన్టీఆర్ ఆలోచనలు అమలవుతున్న తీరు చూసి ఆయన మనల్ని స్వర్గం నుంచి ఆశీర్వదిస్తారన్నారు.  పేదలకు క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడేయడానికి, వైద్యరంగానికి విశేష కృషి చేసిన ఎన్టీఆర్ బసవతారం ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


చంద్రబాబుతో పోటీ పడి పని చేసే అవకాశం వచ్చింది 


ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా మా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆస్పత్రి చైర్మన్ బాలకృష్ణకు హామీ ఇచ్చారు.  
అభివృద్ధి, సంక్షేమంలో చంద్రబాబు నాయుడుతో పోటీ పడి పని చేసే అవకాశం తనకు వచ్చిందని..  అభివృద్ధి, సంక్షేమంలో ప్రపంచానికి తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలవాలని కోరుకున్నారు.  రాజకీయం, సంక్షేమం ఎన్టీఆర్ వారసత్వంగా ఇచ్చారు.  


ఎన్టీఆర్ మూడో తరం కూడా సక్సెస్ కావాలి  
  
ఎన్టీఆర్ రెండు కిలోల రూపాయల బియ్యం, బసవతారకం ఆసుపత్రిని నిర్మించి పేదలను అండగా నిలిచారన్నారు. ఎన్టీఆర్ మొదటి తరం అయితే, రెండో తరం చంద్రబాబు, బాలకృష్ణ అని, మూడో తరం లోకేష్, భరత్ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ మూడో తరం కూడా దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. 


నందమూరి తారక రామరావు సతీమణి, బాలకృష్ణ తల్లి బసవతారకం క్యాన్సర్‌తో చనిపోయారు. అప్పట్లో క్యాన్సర్ వైద్యం అంతగా అందుబాటులో లేదు. ఈ కారణంగా క్యాన్సర్ బారిన పడిన పేదలు చికిత్స తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. అందుకే పేదలకు వైద్య సాయం అందించేందుకు ఎన్టీఆర్ ఈ బసవతారకం ఆస్పత్రిని ప్రారంభించారు. విరాళాలతో నడిచే ఈ ఆస్పత్రిలో పేదలకు చాలా తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుంది. అందుకే అన్ని ప్రభుత్వాలూ ప్రోత్సహిస్తూ ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల  నుంచి క్యాన్సర్ రోగులు వచ్చి చికిత్స పొందుతూ ఉంటారు.