Revanth reddy in Karnataka: ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కర్ణాటకలోని సేడం ఎన్నికల ప్రచార సభలో ఉన్న రేవంత్ రెడ్డి అదే వేదికపై నుంచి తనకు ఇచ్చిన సమన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి, గాంధీ భవన్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను ఉసిగొల్పి ప్రత్యర్థి పార్టీల నేతలను వేధిస్తున్నారని విమర్శించారు.


కర్ణాటకలో అన్ని ఎంపీ స్థానాలను కాంగ్రెస్ గెలవాలని రేవంత్ పిలుపు ఇచ్చారు. మోదీ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఎంతో పోరాటం చేస్తున్నారని.. ఈ పోరాటంలో కర్ణాటక నుంచి 25 ఎంపీలను గెలిపించి మోదీని గద్దె దించడానికి మీరు సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు. కర్ణాటక రాష్ట్రానికి కరువు వస్తే మోదీ ఎలాంటి సహాయం చేయలేదని అన్నారు. మోదీ కర్ణాటకకు ఇచ్చింది ఏమి లేదని.. ఖాళీ చెంబు ఒక్కటి మాత్రమే ఇచ్చారని ఎద్దేవా చేశారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటోంది. రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్ ను గెలిపించండి. ఈ ప్రాంతం నుంచి వచ్చిన ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. మల్లికార్జున ఖర్గేకి మీరు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ఉంది.


గుజరాత్ మోదీకి అండగా ఉన్నట్లే.. కర్ణాటక ఖర్గేకు అండగా నిలవాలి. కర్ణాటక నుంచి 25 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ ను గెలిపించాలి. ఈ ఎన్నికలు కర్ణాటక వర్సెస్ గుజరాత్. బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రినైన నాకు, గాంధీ భవన్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపిస్తున్నారు. మొన్న కర్ణాటకలో, నిన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేపు దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.


హైదరాబాద్ కు ఢిల్లీ పోలీసులు


రేవంత్ రెడ్డి సమన్లు ఇవ్వడం కోసం ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కు సోమవారం (ఏప్రిల్ 29) వచ్చారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు వచ్చి కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జికి, రేవంత్ రెడ్డికి సమన్లు అందించారు. సీఆర్పీసీ 91 ప్రకారం ఢిల్లీలో పోలీసులు ఈ నోటీసులు ఇచ్చినట్ల తెలిసింది. కేంద్ర మంత్రి అమిత్ షాకు చెందిన ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ బాగా వైరల్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అమిత్ షా సిద్దిపేట సభలో మాట్లాడిన మాటలను వక్రీకరించారని ఆరోపిస్తున్నారు. రిజర్వేషన్లు తొలగిస్తాం అన్నట్లుగా ఆ వీడియోను రూపొందించారు. ఈ వ్యవహారంపై కేంద్ర హెంమంత్రిత్వ శాఖ సీరియస్ అయి విచారణకు ఆదేశించింది. అందులో భాగంగానే ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డికి సమన్లు ఇచ్చారు. మే 1న విచారణకు హాజరు కావాలని అందులో ఆదేశించారు.