Revanth Reddy: కాంగ్రెస్ సభ జరిగితే తెలంగాణలో బీఆర్‌ఎస్ పతనం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. విజయభేరి సభ జరుగనున్న ప్రాంతాన్ని శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఈ నెల 17న విజయభేరి సభలో సోనియా గాంధీ 5 గ్యారంటీలను ప్రకటిస్తారని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేసి విజయభేరీ సభకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారని విమర్శించారు. విజయభేరీ సభ కోసం మొదట పరేడ్ గ్రౌండ్ కోసం డిఫెన్స్ అధికారులను అడిగినట్లు చెప్పారు. అయి కేంద్రం తరపున రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాయబారం నడిపారని, తమ ప్రతిష్ఠను కాపాడుకునేందుకు బీజేపీ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు.
బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేసి పరేడ్ గ్రౌండ్‌ను కాంగ్రెస్‌కు ఇవ్వకుండా చేశారని ఆరోపించారు. గచ్చిబౌలి స్టేడియం అడిగినా స్పోర్ట్స్ అథారిటీ తిరస్కరించిందని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్య లేకుండా తుక్కుగూడలో ఖాళీ స్థలంలో నిర్వహించాలనుకున్నామని.. కానీ దేవాదాయ భూములు ఉన్నాయని అందులో కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించారని మండిపడ్డారు. సభ నిర్వహించేందుకు తుక్కుగూడ రైతులే ముందుకొచ్చి తమ భూములు ఇచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. యుద్ధ ప్రాతిపదికన తమ పార్టీ నాయకులు భూములు చదును చేసి సభకు ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు.
కేసీఆర్‌కు ఆ విజ్ఞత కూడా లేదు
తెలంగాణ ఇచ్చిన పార్టీ, నాయకురాలు సోనియా గాంధీ అంటే సీఎం కేసీఆర్‌కు విజ్ఞత కూడా లేదన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ప్రభుత్వం సహకరించాల్సింది పోయి అనుమతులు నిరాకరిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామిక విలువలు కాపాడే ఆలోచన కేసీఆర్‌కు లేదన్నారు. మంత్రి కేటీఆర్ బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీడబ్ల్యూసీ సమావేశాలకు ఒక హోటల్‌లో నిర్వహించాలని అనుకుంటే మంత్రి కేటీఆర్ హోటల్ యాజమాన్యాన్ని బెదిరించారని ఆరోపించారు. బీఆర్ఎస్ అక్రమాలు, దౌర్జన్యాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు సరైన బుద్ధి చెబుతారని అన్నారు.
ఎన్ని ఆటంకాలు ఎదురైనా సీడబ్ల్యూసీ సమావేశం, విజయభేరి సభ
ఈ నెల 16న హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణాలో సీడబ్ల్యూసీ సమావేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఖమ్మం సభ స్ఫూర్తితో 17న విజయభేరి సభ జరుగుతుందని, అందులో తెలంగాణలో అమలు చేయనున్న 5 గ్యారెంటీలను సోనియాగాంధీ ప్రకటిస్తారని ప్రకటించారు. ఖమ్మం సభను అడ్డుకోవాడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయని కుట్ర లేదని, ఇప్పుడు కూడా విజయభేరి సభను అడ్డుకోవడానికి యత్నిస్తోందని ఆరోపించారు. ఎన్ని ఆటంకాలు కలిగించినా ఖమ్మం సభను ఎలా విజయవంతం చేశారో.. అదే స్ఫూర్తితో ఈ విజయభేరి సభను విజయవంతం చేస్తామన్నారు. లక్షలాది మంది యువకులు, రైతులు, నిరుద్యోగులు సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. మరో మూడు నెలల్లో తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు.
కూటమిని ఎదుర్కొనలేకే దేశం పేరు మార్పు
కిషన్ రెడ్డి, కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ సభను అడ్డుకోలేరని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజకీయాలను మలుపు తిప్పే నిర్ణయాలు సీడబ్ల్యూసీలో ఉంటాయని అన్నారు. ప్రధాని మోదీపై భారత్ జోడో ప్రభావం పడిందని విమర్శించారు. I.N.D.I.A కూటమిని నిలువరించలేక దేశం పేరు ఇండియా నుంచి భారత్ మార్చేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాది ముందే రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర చేశారని గుర్తు చేశారు.