G20 Summit: జీ20 సదస్సులో (G20 Summit)లో పాల్గొనేందుకు దేశాధినేతలు, ఇతర అతిథులు దేశా రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. వారందరికి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. సదస్సు ప్రధాన వేదిక ‘భారత్‌ మండపం’లో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో కలిసి రాష్ట్రపతి అతిథులకు స్వాగతం పలికారు.  విందులో భాగంగా ప్రపంచ అగ్రనేతలకు భారతీయ వంటకాలను రుచి చూపించనున్నారు.






అతిథులకు బంగారం, వెండి పాత్రల్లో విందు వడ్డించనున్నారు. స్టార్టర్ కింద మిల్లెట్స్‌తో చేసిన పాట్రమ్, స్పైసీ చట్నీ వడ్డిస్తారు. మెయిన్ కోర్సు కింద చిరుధాన్యాలు, పనసపండుతో చేసిన గాలెట్టె (బ్రెడ్‌ వంటి ఫ్రెంచి వంటకం), గ్లేజ్‌డ్‌ ఫారెస్ట్‌ మష్రూమ్‌, చిరుధాన్యాల వంటకాలు, కేరళ రెడ్‌రైస్‌, వివిధ రకాల బ్రెడ్‌లతోపాటు ముంబయి పావ్‌, బకర్‌ఖని వడ్డించనున్నారు. డెజర్ట్‌లో యాలకులు, ఊదలతో చేసిన మధురిమ అనే పుడ్డింగ్‌, ఫిగ్‌ పీచ్‌ కంపోట్‌, ఆంబేమొహార్‌ క్రిస్పీస్‌, పాలు-గోధుమలతో చేసిన నట్స్‌ ఉంటాయి. పానీయాల్లో కశ్మీరీ ఖావా, ఫిల్టర్‌ కాఫీ, డార్జిలింగ్‌ టీ, పాన్‌ ఫ్లేవర్డ్‌ చాక్లెట్‌ ఏర్పాటు చేశారు.


170 మందికి ఆహ్వానం
ఈ విందుకు మొత్తం170 మంది అతిథులను ఆహ్వానించారు. వివిధ దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షులు, ప్రతినిధులు, ప్రధాన మంత్రి, మాజీ ప్రధానులు, కేబినెట్‌ మంత్రులు, సహాయ మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్‌, ఆయన సతీమణి సుదేశ్‌ ధన్‌కడ్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ విందుకు హాజరవుతారు. 


ఈ విందులో కేంద్ర మంత్రులు రాజనాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌, నరేంద్ర సింగ్‌ తోమర్‌, ఎస్‌ జైశంకర్‌, అర్జున్‌ ముండా, స్మృతి ఇరానీ, పియూష్ గోయెల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రహ్లాద్‌ జోషీ హాజరయ్యారు. కేంద్ర మంత్రులు నారాయణ రాణె, సర్బానంద సోనోవాల్‌, వీరేంద్ర కుమార్ పరాస్‌, గిరిరాజ్‌ సింగ్‌, జ్యోతిరాధిత్య సింధియా, అశ్విని వైష్ణవ్‌, పషుపతి కుమార్‌ పరాస్‌, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, కిరణ్‌ రిజిజు, రాజ్‌కుమార్‌ సింగ్‌, హర్‌దీప్‌ సింగ్‌ పూరి, మన్‌సుక్‌ మాండవీయ, భూపేంద్ర యాదవ్‌, మహేంద్ర నాథ్‌ పాండే, పురుషోత్తమ్‌ రూపాలా, జి కిషన్‌ రెడ్డి, అనురాగ్‌ ఠాకూర్‌ ఆహ్వానితుల జాబితాలో  ఉన్నారు.


కాగ్‌ అధినేత గిరీశ్‌ చంద్ర ముర్ము, లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా, ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ దోవత్‌, దిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా, జీ20 షర్ఫా అమితాబ్‌ కాంత్‌ ముఖ్య అతిథులు వస్తున్నారు. మాజీ ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, దేవే గౌడకు ఆహ్వానాలు అందాయి. అనారోగ్య కారణాలతో విందుకు రావడం లేదని దేవెగౌడ ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ విందుకు ఆహ్వానించారు. రాజకీయ నాయకులను ఈ విందుకు ఆహ్వానించలేదు.