Revant Reddy :    కొడంగల్‌లోని టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి నివాసంలో గత మూడు రోజులుగా చండీయాగం జరుగింది. చివరి రోజు  రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా చండీయాగంలో పాల్గొన్నారు. ఈ పూజ కార్యక్రమానికి స్థానిక పార్టీ లీడర్లు, కార్యకర్తలు హాజరయ్యారు. తెలంగాణలో ప్రజారంజకమైన పాలన రావాలని కోరుకుంటున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి  చెప్పారు.  కొడంగల్‌ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలు సుఖ, సంతోషాలతో విలసిల్లాలని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 


చండీయాగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు సహకరించిన అందరికి కృతజ్ఞతలు రేవంత్ రెడ్డి తెలిపారు. చండీయాగంతో రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి సిద్దించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణకు మంచిరోజులు వస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్న రేవంత్‌ రెడ్డి కొడంగల్ ప్రజల ఆశీర్వాదం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న ఈ చండీయాగం రాజకీయంగా కూడా నేతల్లో చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పోరాడుతున్న రేవంత్ రెడ్డి దైవ సంకల్పం కోసమే ఈ యాగం చేశారని  పార్టీ నేతలు చెబుతున్నారు. 


 ఎన్నికల వేళ దైవానుగ్రహం కోసం పలువురు రాజకీయ నేతలు యాగాలను నిర్వహిస్తూ ఉంటారు.  గతంలో సీఎం కేసీఆర్ సైతం కీలకమైన సమయాల్లో పలు యాగాలు నిర్వహించారు. గత జూలైలో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అతిరుద్ర మహాయాగం నిర్వహించారు.  తాజాగా రేవంత్ రెడ్డి సైతం యాగాన్ని నిర్వహించడం ఆసక్తిగా మారింది. అయితే ఈ యాగాల విషయంలో కేసీఆర్ ది ప్రత్యేకత. ఆయన ప్రతి ఎన్నికలకు ముందు యాగాలు నిర్వహిస్తారు. 2018లో ముందస్తుకు వెళ్లే ముందు కూడా కేసీఆర్ యాగాలు నిర్వహించారు. కానీ ఈ సారి ఇంకా యాగాల విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. 


ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం రేవంత్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. గెలిచే అవకాశం ఉన్న ఏ ఒక్క నేతనూ వదిలి పెట్టకుండా పార్టీలోకి ఆకర్షిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరుతున్నారు. కల్వకుర్తికి చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మరో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆయన కుమారుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గెలుపు గుర్రం అనిపిస్తే.. వెంటనే టిక్కెట్ హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం కూడా సీనియర్ నేతలను ఆకర్షిస్తున్నారు. బీజేపీ నుంచి కనీసం ఇరవై మంది నేతలు వచ్చే వారం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. 


గతంలో లేని విధంగా పార్టీ సీనియర్ నేతలంతా కలసి కట్టుగా పని చేస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడటం లేదు. వీటన్నింటి మధ్య ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం సాధించాలని చండీయాగం నిర్వహించారు రేవంత్ రెడ్డి.