Revanth Reddy  Official Residence In Delhi :  దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ సీఎం అధికారిక నివాసం తుగ్లక్‌ రోడ్‌ 23ని నూతన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోసం అధికారులు సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్‌ పేరుతో ఉన్న పాత నేమ్‌ ప్లేట్‌ను తొలగించి, ఆ స్థానంలో సీఎం రేవంత్‌ రెడ్డి పేరుతో కొత్త నేమ్‌ ప్లేట్‌ను పెట్టారు. తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ మూడు భాషల్లో సీఎం రేవంత్‌ పేరును ఏర్పాటు చేశారు.  


కేంద్ర మంత్రి హౌదాలో 2004 లో ఈ నివాసానికి మారిన కేసీఆర్‌, అనంతరం ఉద్యమ నేతగా, తెలంగాణ సీఎంగా దాదాపు 20 ఏండ్ల పాటు ఈ నివాసంలో ఉన్నారు. ఎంపీగా ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ జాతీయ పార్టీ వ్యవహారాలు చక్కబెట్టాలనుకున్నప్పుడు ఈ ఇంట్లోనే ఉన్నారు. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం కోల్పోవడంతో కేసీఆర్‌ ఈ నివాసాన్ని ఖాళీ చేయక తప్పలేదు. కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన వస్తువులు, విలువైన సామాగ్రి ఇటీవలే తరలించడంతో… నూతన సీఎం కోసం ఢిల్లీ తెలంగాణ భవన్‌ అధికారులు మరమ్మతులు చేశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి  బంధువులు తుగ్లక్‌ రోడ్‌ ఇంట్లో పూజలు కూడా నిర్వహించినట్లు  కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  వారి సూచనల ప్రకారమే  సీఎం రేవంత్‌ పేరుతో బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు పలు రకాల మార్పులు, మరమ్మతులు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.  ఢిల్లీ చేరుకున్న వెంటనే రేవంత్ రెడ్డి.. ఇంటిని పరిశీలించారు.                           


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ పీఏసీ చేసిన తీర్మానాన్ని అధిష్ఠానానికి అందించనున్నారు.ఢిల్లీ పర్యటన ముగించుకుని ఈ సాయంత్రం తిరిగి హైదరాబాద్‌‌కు బయలుదేరి వస్తారు.                                           


సాధారణంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి  మర్యాదపూర్వకంగా కలుస్తారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా ప్రధానిని కలిసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.  కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తదితర అంశాలపైనా కేంద్రంలోని ముఖ్యులను కలిసి వారితో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కోరినట్టు సమాచారం. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి.. కేంద్ర పెద్దలను కోరేందుకు సహకరించాలని కోరారు.  అయితే ఈ ఢిల్లీ పర్యటనలో భేటీలు ఉంటాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.