Kodangal News: తనను దొంగ దెబ్బతీయడం లక్ష్యంగా తెరవెనుక గూడు పుఠాణి జరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీని పడేయాలని కొంత మంది ఈ ప్రాంతంలో తిరుగుతున్నారని అన్నారు. కొడంగల్ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్‌లో తన ప్రతిష్ఠను తగ్గించడం కాదని.. కొడంగల్ ప్రతిష్ఠను దెబ్బతీయడం అని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం అని అన్నారు. ‘‘రేపు ఏదైనా తప్పిదం జరిగితే క్రిష్ణా - వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోతుంది. కొడంగల్ లో వచ్చే సిమెంటు ఫ్యాక్టరీ, నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం, పాలమూరు - రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా పోవడం లాంటి నష్టాలు ఎన్నో జరుగుతాయని రేవంత్ రెడ్డి అన్నారు.
డీకే అరుణ ఎలాగైనా సరే తనను దెబ్బతీయాలని, తూట్లు పొడిచి తన ఇజ్జత్ తీయాలని చీకట్లో తిరుగుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా చేసుకుందామని పిలుపు ఇచ్చారు. పాలమూరు పార్లమెంటు సీటుకు కొడంగల్ నుంచి భారీ మెజారిటీ రావాలని కోరారు. వంశీచంద్ రెడ్డిని గెలిపిస్తే.. ప్రజల సిపాయిగా ఢిల్లీలో ఉండి పని చేస్తాడని రేవంత్ రెడ్డి అన్నారు.
‘‘రేవంత్ రెడ్డిని ఎందుకు కింద పడేయాలి? మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్, వెటర్నరీ కాలేజీలు తెచ్చుకున్నందుకు కిందపడేయాలా? కరువు ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతానికి నారాయణపేట ఎత్తిపోత పథకంతో ప్రతి ఎకరాకు నీళ్లిస్తున్నందుకు కిందపడేయాలా? సిమెంటు ఫ్యాక్టరీ పెట్టడానికి అనుమతులు తెస్తున్నందుకు కింపడేయాలా? ఎందుకు నన్ను కిందపడేయాలని అనుకుంటున్నారు? ఇప్పుడు మన గౌరవాన్ని దెబ్బతీయడానికి కుట్రలు జరుగుతున్నాయి. డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు చూశారు. మోదీ పదేళ్లు ప్రధానిగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. సోనియమ్మ నాయకత్వంలో ఈరోజు రూ.5 వేల కోట్ల పనులు జరుగుతున్నాయి. కొడంగల్ నుంచి పాలమూరు ఎంపీ అభ్యర్థికి 50 వేల మెజారిటీ ఇచ్చి అందరి కుట్రలు, కుతంత్రాలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది’’ అని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు.