Hyderabad Latest News: గ్రేటర్ హైదరాబాద్‌లో నాణ్యత లోపించిన ఆహార పదార్థాల అమ్మకపు ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా మేడ్చల్‌ పట్టణంలో మరో ఘటన జరిగింది. బాధితుడు శివ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పట్టణంలో ఉన్న కేఎఫ్‌సీ నుంచి స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేసిన చికెన్ లెగ్ పీస్‌లు కుళ్లినట్లుగా గుర్తించారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరు వాసి శివ చికెన్ లెగ్ పీసులు ఆర్డర్ చేశాడు. ప్యాకెట్ ఓపెన్ చేసి రుచి చూడగా శివ షాక్‌కు గురయ్యాడు.


తన ఆరేళ్ల చిన్నారి ఈ ఆహారాన్ని తిని వాంతులు చేసుకున్నట్లు శివ చెప్పాడు. చికెన్ లెగ్ పీస్‌లు కుళ్లిపోయి ఉండడంతో మేడ్చల్ పట్టణంలో ఉన్న కేఎఫ్‌సీకి వెళ్లి శివ సిబ్బందిని ప్రశ్నించాడు. నిర్వహకులు స్పందిస్తూ.. తాము ఫ్రెష్ చికెన్ మాత్రమే ఎల్లప్పుడూ వాడుతుంటామని.. ఇలా కుళ్లిన చికెన్ ఎలా వచ్చిందో తమకు తెలియదని చెప్పారు. ఇంకోసారి ఇలాంటి సమస్య తలెత్తకుండా చూసుకుంటామని చెప్పారు.


‘‘మేడ్చల్ కేఎఫ్‌సీలో నేను జంబో ప్యాక్ చికెన్ లెగ్ పీస్‌లు ఆర్డర్ చేశాను. ఏప్రిల్ 7న సాయంత్రం 5.30 గంటలకు ఆర్డర్ పెట్టగా.. రాత్రి 7 గంటలకు ఆర్డర్ నాకు వచ్చింది. ఈ లెగ్ పీస్‌ల లోపల మొత్తం కుళ్లిపోయి వాసన వస్తోంది. చిన్న పిల్లలు వీటిని తింటే పరిస్థితి ఏంటి? ఈ లెగ్ పీసుల్ని నేను స్విగ్గీ ద్వారా కేఎఫ్‌సీలో ఆర్డర్ పెట్టాను. రూ.599 పేమెంట్ చేశాను. కుళ్లిన చికెన్ ఉండడంతో నేను కేఎఫ్‌సీకి వచ్చి ప్రశ్నించగా.. వారు ఆర్డర్ ఎక్స్‌ఛేంజ్ చేస్తానని చెప్పారు. ఈ సమస్య ఇంకోసారి రిపీట్ కాదని కేఎఫ్‌సీ నిర్వహకులు చెబుతున్నారు’’ అని బాధితుడు శివ తెలిపారు.