Revanth On Kavitha:  తాను అధికారంలో ఉన్నంత వరకూ కేసీఆర్ కుటుంబసభ్యులెవరూ పార్టీలో చేర్చుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. మంత్రుల శాఖల కేటాయింపుపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు.  కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు నా దగ్గర ఉన్న శాఖలను కేటాయిస్తానని ... ఇప్పట్లో శాఖల ప్రక్షాళన ఉండదని  చెప్పారు. పాత మంత్రుల శాఖలు యథావిధిగా కొనసాగుతాయన్నారు.  ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద కీలకమైన పదకొండు కీలకమైన శాఖలు ఉన్నాయి. వీటిలో హోం, క్రీడలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణ అభివృద్ధి, విద్య వంటివి ఉన్నాయి.  కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వారికి తన వద్ద ఉన్న ఈ శాఖల నుంచే కేటాయింపులు జరుగుతాయని సీఎం రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇచ్చినట్లయంది. తాను శాఖల కేటాయింపు కోసం కాలేదని..కులగణన అంశాలపై చర్చించడానికే వచ్చామని రేవంత్ చెబుతున్నారు.  

కీలక శాఖల కోసం ప్రయత్నిస్తున్న సీనియర్లు          

మంత్రి వర్గాన్ని విస్తరించిన వెంటనే.. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులుగా అక్కడే ఉన్నారు. హైకమాండ్ పెద్దలతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు.. ప్రమాణ స్వీకారాన్ని ముగ్గురు మంత్రులతో పూర్తి చేశారు.వారికి శాఖల కేటాయింపు విషయంలో స్పష్టత లేకపోవడంతో హైకామాండ్ వద్దకు వెళ్లినట్లుగా ప్రచారం జరిగింది. రేవంత్ అక్కడ చర్చలు జరుపుతున్న సమయంలోనే..  సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్తారన్న ప్రచారం జరిగింది కానీ ఆయన వెళ్లలేదు. ఆయనతో హైకమాండ్ వరుసగా సంప్రదింపులు జరుపుతోందని చెబుతున్నారు.           

హోం, మున్సిపల్ శాఖల కోసం హైకమాండ్ వద్ద పంచాయతీ 

రేవంత్ రెడ్డి వద్ద ఉన్న కీలకమైన శాఖల్లో కొన్ని తమకు కేటాయించాలని సీనియర్ మంత్రులు గట్టిగా పట్టుపడుతున్నట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా హోంశాఖ కోసం అటు ఉత్తమ్ ఇటు భట్టి ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే రేవంత్ ..వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆ శాఖ ఇవ్వాలనుకుంటే కొత్తగా ప్రమాణం చేసిన వారికి ఇవ్వాలన్న ప్రతిపాదన పెట్టినట్లుా  చెబుతున్నారు.  అలాగే మున్సిపల్ శాఖను కూడా కొత్త మంత్రికే కేటాయించనున్నారు. రేవంత్ ప్రమాణం చేసినప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న భ ట్టికి హోంశాఖ ఇస్తారని అనుకున్నారు. 

కొత్త వాళ్లకే తన వద్ద ఉన్న శాఖలిస్తానన్న రేవంత్          

కానీ హోంశాఖ అత్యంత కీలకమైనది. మరో పవర్ సెంటర్ లా మారితే సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఆ శాఖను ఎవరికీ ఇవ్వలేదు. ఆయనే నిర్వహిస్తున్నారు.  ఇప్పుడు కొత్తగా ముగ్గురు సభ్యులను తీసుకున్నందున.. శాఖల మార్పులు చేర్పులు తప్పవని.. తమ డిమాండ్ ను పరిశీలించాలని..తమకు ప్రాధాన్యత శాఖల్ని ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్లుగా  చెబుతున్నారు. రేవంత్ వ్యూహాత్మకంగా శాఖల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని చెప్పడం ద్వారా సీనియర్ల ప్రయత్నాలకు చెక్ పెట్టారని అనుకోవచ్చంటున్నారు.