Telangana Rains Alert: తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రాబోయే 72 గంటలు అందరూ అప్రమత్తంగా ఉండాలని.. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఎక్కడ ఏం జరిగినా సమాచారం కంట్రోల్ రూం కు చేరేలా చూడాలన్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించాలని.. ఎక్కడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగడానికి వీల్లేదన్నారు. 

సహాయక చర్యలకు అవసరమైన నిధులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలన్నారు. మొబైల్ ట్రాన్స్ఫార్మర్ లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని.. అత్యధిక వర్షాలు పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. గతంలో ఖమ్మంలో 2 గంటల్లో 42 సెం.మీ వర్షం పడిందని.. అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు చేసి 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. 

హైదరాబాద్ లో  ప్రమాద స్థాయికి నీరు చేరిన చోట ప్రజలు వెళ్లకుండా పోలీసు సిబ్బంది అలెర్ట్ చేయాలని..  మూడు కమిషనరేట్ లలో ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు. వర్షాలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఎఫ్ఎం రేడియోలలో అలర్ట్ చేయాలన్నారు. మన వ్యవస్థలో 24 గంటల్లో 2 సెం.మీ వర్షం ను దృష్టిలో ఉంచుకొని పట్టణాలు నిర్మాణం అయ్యాయని కానీ క్లౌడ్ బరస్ట్ సమయాల్లో పరిస్థితులను ఎదుర్కొనేలా సన్నద్ధం కావాల్సి ఉందన్నారు.  

పరిస్థితులనుబట్టి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాలని సీఎం సూచించారు. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసేలా చర్యలు తీసుకోవాలిని.. సాధ్యమైనంత వరకు రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉండేలా చూడాలన్నారు. అత్యవసర టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ సమాచారం అందించాలన్నరాు.   తప్పుడు వార్తలతో భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయొద్దని మీడియా, సోషల్ మీడియాకు సూచింంచారు. సమాచార శాఖ మీడియాకు సరైన సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని..రాబోయే 72 గంటలు అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలన్నారు.  

వాతావారణ అంచనాలు ఇప్పుడు చాలా మందుగా తెలుస్తున్నందున జాగ్రత్తలు తీసుకోవడానికి సమయం ఉంటోంది.  సీఎం రేవంత్ గత ఆదివారం.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు వస్తే నీళ్లు నిలిచిపోయే ప్రాంతాల్లో పర్యటించి తక్షణం తీసుకోవాల్సిన జాగ్రత్తలపైఆదేశాలు జారీ చేశారు.