Revant Reddy :  తెలంగాణ మంత్రి కేటీఆర్ టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో తనపై దాఖలు చేసిన పరువు నష్టం కేసు నోటీసులకు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. తాను నిరుద్యోగుల తరపున మాట్లాడానని స్పష్టం  చేసింది. టీఎస్‌పీఎస్సీకి టెక్నికల్ సపోర్ట్ మొత్తం ఐటీ శాఖ ఇస్తుందని.. అలాంటప్పుడు ఐటీ శాఖకు సంబందం లేకుండా ఎలా ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కేసు  విషయంలో సీబీఐ విచారణ కావాలని ఇప్పటికే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశామని గుర్తు చేశారు. కేటీఆర్ పంపిన లేఖలో పలు అంశాలను గుర్తు చేస్తూ.. నోటీసులను వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు తీసుకంటానని రివర్స్‌లో రేవంత్ రెడ్డి హెచ్చరించడం కీలకంగా మారింది. 
   
TSPSC పేపర్‌ లీక్‌ వ్యవహారం కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. దీనిపై ఆధారాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డికి సిట్ కూడా నోటీసులు జారీ చేసింది. ఆయన సిట్ ఎదుట హాజరై తన వద్ద ఉన్న వివరాలు ఇచ్చారు.ఆ తర్వాత కూడా రేవంత్ రెడ్డి కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.  వాటిపై తీవ్ర స్పందించిన కేటీఆర్.. తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేశారంటూ నిప్పులు చెరిగారు. ఈ వ్యవహారంలోకి తరచూ తన పేరు లాగుతున్నారని లాయర్ ద్వారా లీగల్ నోటీసులను పంపించారు. సుదీర్ఘ కాలంగా ప్రజా క్షేత్రంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న కుట్రతోనే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నంత మాత్రానా.. ఎదుటి వాళ్లపై అసత్య ప్రేలాపనాలు సరికాదని హితవు పలికారు.                                         


రేవంత్ రెడ్డికి ఐపీసీ సెక్షన్‌ 499, 500 నిబంధనల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులను కేటీఆర్ పంపించారు. ఎలాంటి ఆధారాలు లేని అసత్య ఆరోపణలను ఇద్దరూ వారం రోజుల లోపు వెనక్కు తీసుకోవటంతో పాటు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసుల్లో మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తనపై ఎప్పుడెప్పుడూ.. ఎవరెవరు ఎలాంటి ఆరోపణలు చేశారనే వాటికి సంబంధించిన సాక్ష్యాలను నోటీసుల్లో ప్రస్తావించారు కేటీఆర్. వారం రోజులు అవుతున్నందున రేవంత్ రెడ్డి ఆ నోటీసులకు రిప్లయ్ ఇచ్చారు. 


మరో వైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు కూడా ఇలాంటి నోటీసులు జారీ చేశారు. అయితే ాయన స్పందించలేదు. గతంలో సిట్ కూడా ఆయనకు నోటీసులు జారీ చేసింది. రెండు సార్లు సిట్ నోటీసులు జారీ చేసినా తాను హాజరు కాబోనని బండి సంజయ్ స్పష్టం చేశారు.రేవంత్ రెడ్డి స్పందించకపోవడం.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నోటీసుల్ని వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరికలు జారీ చేయడంతో కేటీఆర్ తదుపరి ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.