Telangana Budget : తెలంగాణ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రతిపాదించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తోంది. లోక్ సభ ఎన్నికలు ఉన్నందున ఏడాది మొత్తం బడ్జెట్ పెట్టే వీలు లేదు. అందుకే ఓటాన్ అకౌంట్ పద్దునే ప్రవేశ పెడతారు. ఇందులో తాత్కాలిక కేటాయింపులే ఉంటాయి. పూర్తి బడ్జెట్ లో రాష్ట్రాలకు కేటాయించే గ్రాంట్లపై స్పష్టత వస్తుంది. అందుకే కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాతనే తెలంగాణనూ బడ్జెట్ పెట్టాలని అనుకుంటున్నారు. ముందుగా ఓటాన్ అకౌంట్ పెట్టాలని భావిస్తున్నారు.
ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం
రేవంత్ సర్కార్ కూడా ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్‌ను, ఎలక్షన్ల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను శాసనసభకు సమర్పించనుంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ ఫిబ్రవరిలో రానుంది. ఈ క్రమంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టటం సాధ్యం కాదు. అయితే వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలను పూర్తి స్థాయిలో తీసుకుని, అందుకనుగుణంగానే పద్దును రూపొంది స్తున్నారు. కానీ ఎన్నికల నేపథ్యంలో జీతాలు, భత్యాలు, ఇతరత్రా నిర్వహణ ఖర్చులను ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు కోసం ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టి, శాసనసభ అనుమతి తీసుకోనున్నారు. ఎన్నికల తర్వాత మరోసారి అన్ని శాఖల పద్దులను క్రోడీకరించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు.
ఆరు గ్యారంటీలకు నిధుల సమీకరణ కీలకం
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ప్రస్తుతానికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు అమలవుతున్న సంగతి తెలిసిందే. మిగతా గ్యారెంటీల అమలు ఎన్నికల తర్వాతే ఉంటుందంటూ ఉన్నతాది óకారులు చెబుతున్నారు. వాటిని అమలు చేయాలంటే నిధులు సమకూర్చుకోవాలి, నియమ నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధికార యంత్రాంగమంతా క్షేత్రస్థాయిలోకి దిగి, లబ్దిదారులను ఎంపిక చేయాలి. ఇప్పటికే ప్రజా పాలన పేరిట దరఖాస్తులను స్వీకరించినప్పటికీ వాటి పరిశీలనకు మరింత సమయం పట్టే అవకాశముంది. అందువల్ల మిగతా గ్యారెంటీలన్నీ అమలు కావాలంటే లోక్‌సభ ఎన్నికలు అయ్యేంత వరకూ వేచి చూడక తప్పదని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.
గ్యారంటీల అమలు కోసం ఒత్తిడి
ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఇప్పటికే ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని పట్టుబడుతోంది. లోక్‌సభ ఎన్నికల కోడ్, ఓటాన్ అకౌంట్ పేరిట హామీలను విస్మరించకూడదంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరతామంటూ చెబుతున్న ప్రభుత్వం… అందుకోసం ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతున్నదో చూడాలి. ఆర్థిక వేత్తలు, నిపుణులు మాత్రం…’కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు’ అనేవి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినవి కాబట్టి, అవి ‘ఆన్ గోయింగ్’ పరిధిలోకి వస్తాయి…’ అని చెబుతున్నారు. అందువల్ల ఆయా పథకాలకు నిధులు కేటాయిస్తే, వాటిని అమలు చేయ టానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని అభిప్రాయ పడుతున్నారు.