Telangana Farmers News: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న భారీ రుణమాఫీపై నెలకొన్న ప్రధాన సందేహంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. రుణమాఫీకి అర్హత పొందాలంటే ఆ రైతుకు రేషన్ కార్డు తప్పకుండా ఉండాలనే నిబంధనపై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్ బుక్ ఆధారంగానే కుటుంబానికి రూ.2 లక్షల పంట రుణమాఫీ ఉంటుందని స్పష్టం చేశారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన ఉందని.. రేవంత్ రెడ్డి కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి వెల్లడించారు.
తెలంగాణ సచివాలయంలో మంగళవారం (జూలై 16) జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా ఇతర మంత్రులు, రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాద్యక్షుడు చిన్నారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
18న రూ.లక్ష రూపాయల వరకు రుణమాఫీ
జూలై 18న రూ.లక్ష వరకు రుణమాఫీ జరుగుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ రోజు సాయంత్రంలోగా రైతుల రుణఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయని చెప్పారు. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్దిదారులతో సంబరాలు ఉంటాయని వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరు అవుతారని వివరించారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే మాత్రం బ్యాంకర్లపైన కఠిన చర్యలు ఉంటాయని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.