Revanth Reddy Review on  Telangana Bhavan : ఢిల్లీలో తెలంగాణ భవన్,  ఆంధ్రప్రదేశ్ భవన్ ఆస్తుల విభజన, నూతన తెలంగాణ భవన్ నిర్మాణ విషయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఉమ్మడి ఆస్తుల్లో తెలంగాణ వాటా, నూతన భవనాల నిర్మాణంపై తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ భవన్ ఓఎస్డి  సంజయ్ జాజులతో ముఖ్యమంత్రి చర్చించారు.


కేంద్రం ప్రతిపాదించిన ఆస్తుల పంపకానికి అంగీకారంతెలిపే అవకాశం 


ఢిల్లీలోని తెలంగాణ భవన్ విషయంలో   కేంద్రం చూపించిన పరిష్కారానికి తెలంగాణ సర్కార్ అంగీకరించే అకాశం ఉంది.  గతంలో ఢిల్లీలో అశోక రోడ్ లోని ఏపీ-తెలంగాణ భవన్ తమకే కావాలని గత తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ, ఏపీ అధికారుల ముందు తెలంగాణ అధికారులు ప్రతిపాదనలు ఉంచారు. హైదరాబాద్ హౌస్ కి అనుకొని ఉన్న స్థలంతో తెలంగాణ ప్రజలకు భావోద్వేగ సంబంధాలున్నాయని గతంలో హోంశాఖ, ఏపీ అధికారులకు తెలంగాణ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఏపీ- తెలంగాణ భవన్, శబరి బ్లాక్, రోడ్డు, నర్సింగ్ హాస్టల్ సహా 12 ఎకరాల పైగా భూమి తమకు చెందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షగా హోంశాఖ, ఏపీ అధికారులకు తెలంగాణ అధికారులు తెలిపారు. 58:42 నిష్పత్తిలో ఏపీకి దక్కాల్సిన భూమికి మార్కెట్ ధర ప్రకారం ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఏపీ అధికారులకు తెలంగాణ అధికారులు తెలిపారు.


ఖాళీ స్థలం తెలంగాణ తీసుకోవాలని కేంద్రం సూచన 


గతంలో ఏపీ భవన్ ఏపీకేనని, ఖాళీ స్థలాన్ని తెలంగాణ తీసుకోవాలని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఉమ్మడి ఆస్తుల విభజనపై సమావేశం తర్వాత గత  ఏప్రిల్ 26న కేంద్ర హోంశాఖ సమావేశం మినిట్స్ విడుదల చేసింది. పటోడి హౌస్ 7.64 ఎకరాల స్థలాన్ని తెలంగాణకు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ప్రతిపాదించింది. శబరి బ్లాకు, గోదావరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్ బ్లాక్ లను 12.09 ఎకరాలు ఏపీకి ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనతో ఏపీ, తెలంగాణ జనాభా నిష్పత్తికి అనుగుణంగా రెండు రాష్ట్రాలకు వాటా దక్కుతుందని తెలిపింది. చాలా తక్కువ తేడా ఉంటుందని, అవసరమైతే ఏపీ ప్రభుత్వం కొంత రియంబర్స్ మెంట్ చేస్తుందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. 


కేంద్రం ప్రతిపాదనకు ఏపీ అంగీకారం 


కేంద్ర ప్రతిపాదన ఆచరణ యోగ్యంగా ఉందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. గతంలో కేసీఆర్ సర్కార్ ఇంకా ఏమీ చెప్పలేదు. ఇప్పుడు రేవంత్ సర్కార్ ఆమోదం తెలియచేయడం ఖాయమయింది.  ఢిల్లీలోని అశోకా రోడ్డుతో పాటు శ్రీమంత్ మాధవరావు సింథియా మార్గ్ లో కలిపి రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా 19. 733 ఎకరాల భూమి ఉంది. అశోకా రోడ్డులోని 8. 726 ఎకరాల్లో ఏపీ-తెలంగాణ భవన్ ఉంది. ఉమ్మడి భవన్ లో ఏపీ వాటా 4.3885 ఎకరాలు  , తెలంగాణ వాటా 4.3375 ఎకరాలు  గా ఉంది. 0.511 ఎకరాల రోడ్డులో రెండు రాష్ట్రాలకు చెరో 0.2555 ఎకరాలు ఉంది.