Revanth Reddy: కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లు "మూడు గంటలు" అంటూ ఎంత దుష్ప్రచారం చేసినా.. మూడు చెరువుల నీళ్లు తాగినా.. బీఆర్ఎస్ సర్కారు మూడోసారి అధికారంలో రావడం కల్లా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందిస్తామన్నారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. 12 గంటల పాటు కూడా తెలంగాణ సర్కారు నాణ్యమైన ఉచిత విద్యుత్ కూడా ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ సర్కారు తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచడం జరిగిందన్నారు. అలాగే సర్కార్ విద్యుత్ కుంభకోణాలను వెలికితీస్తామన్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి 120 ఎకరాలు ఎలా సంపాదించాడో కూడా తేలుస్తామన్నారు. 






ఇటీవలే 8 గంటల విద్యుత్ ఇస్తే సరిపోతుందన్న రేవంత్ రెడ్డి


అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి జగదీష్ రెడ్డి వక్రీకరించారని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. 8 గంటల నాణ్యమైన, ఉచిత విద్యుత్ ఇస్తే రైతులకు సరిపోతుందని రేవంత్ చెప్పారు. అన్నదాతలకు ఉచిత విద్యుత్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేసే ప్రసక్తే లేదని రేవంత్ పేర్కొన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిందే తమ పార్టీ అని, వారి రుణాలు సైతం మాఫీ చేసి అన్నదాతలకు అండగా నిలిచింది తామే అన్నారు. కానీ రైతులకు ఉచిత విద్యుత్ తీసేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని, కేవలం 3 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని చూస్తున్నారని మంత్రి కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అంశం తెలంగాణ ఎన్నికల్లో కీలకమైన విషయమని తెలిసిందే. 


రేవంత్ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నేతలు రోడ్లపైకి వచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లోకల్ లీడర్ల అంతా తెలంగాణ పీసీసీ చీఫ్‌ చేసిన కామెంట్స్‌పై గుస్స అయితున్నారు. అధికారంలోకి రాక ముందే కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని బయటపెడ్డుకుందని మండిపడుతున్నారు. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ కాంగ్రెస్ దిష్టి బొమ్మలను దహనం చేస్తున్నారు. 


రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్‌ చాలు అంటూ తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ పోరు తీవ్రతరం చేసింది. మంగళవారం పార్టీ నేతలంతా ఎక్కడికక్కడ ప్రెస్‌మీట్‌లు పెట్టి రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తే బుధవారం రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్కారోకోలు చేశారు. ఖబడ్దార్ రేవంత్‌ అంటూ హెచ్చరికలు చేస్తున్నారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. వీళ్లంతా రైతు వ్యతిరేకులని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఖైరతాబాద్‌లోని విద్యుత్ సౌధా వద్ద ఎమ్మెల్సీ కవిత ధర్నాకు దిగారు. రేవంత్‌కు, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తే కాంగ్రెస్‌కు వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు. ఈక్రమంలోనే రేవంత్ రెడ్డి మరో ట్వీట్ చేశారు. 24 గంటల పాటు ఉచిత, నాణ్యమైన విద్యుత్తును ఇస్తామన్నారు.