Revanth Reddy To Delhi : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. దరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ఉన్నారు. మంగళవారం కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం భేటీ కానున్నారు. కేబినేట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులతో పాటుగా లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల గురించి హైకమాండ్‌తో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం, డిప్యూటీ సీఎం కలిసే అవకాశం ఉంది.
పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై హైకమాండ్‌తో రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. కేబినెట్లో ప్రాతినిథ్యం లేని హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిథ్యం కల్పించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే.. ఎవరికి ప్రాధాన్యత కల్పించాలనే దానిపై పార్టీ నాయకత్వంతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలపై కూడా కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలనే వ్యూహంతో హస్తం పార్టీ వ్యూహలు రచిస్తుంది.
ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరించింది. బీఆర్‌ఎస్ నుంచి కొత్తగా పార్టీలోకి వస్తున్నవారితో పాటు.. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లివ్వకపోయినా సర్దుకుపోయిన సొంత పార్టీ నేతల నుంచి ఎంపీ టికెట్ల విషయంలో ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఎంపీ టికెట్లివ్వలేని వారికి కార్పొరేషన్ పదవులిచ్చి బుజ్జగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలపై అధిష్టానంతో చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ఢిల్లీకి వెళ్లారని సమాచారం. దీనికి తోడు రేపు ఆర్థిక, రైల్వే శాఖ కేంద్ర మంత్రులతో సీఎం బృందం సమావేశం కానుంది. దీంతో పాటు ఒక ప్రైవేట్ ఫంక్షన్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
విద్యుత్ శాఖ అర్హులను గుర్తించిన అనంతరం ఆ వివరాలను ప్రభుత్వానికి పంపనుంది. అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వీటిపై అధిష్టానం పెద్దలకు రేవంత్ రెడ్డి వివరించనున్నారు. అధిష్టానం సూచనల మేరకు పథకాలు ప్రవేశపెట్టనున్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు పూర్తైంది. దీంతో ఆరు గ్యారెంటీల అమలుపై రేవంత్ సర్కార్ స్పీడ్ పెంచింది. పార్లమెంట్ ఎన్నికల్లోపు మిగతా పథకాలను అమలు చేయడంపై దృష్టి సారించింది.