Telangana Elections 2023 :   కేసీఆర్ మాయమాటలు, కేటీఆర్ నక్కజిత్తులు నమ్మి బీఆర్ఎస్‌కు ( BRS ) ఓటు వేస్తే మోసపోవడం ఖాయం అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను గెలిపిస్తే కామారెడ్డిలో వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేస్తారని హెచ్చరించారు. మంగళవారం కామారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కామారెడ్డిలో ( Kamareddy ) ఓటుకు రూ.10 వేలు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు.  కేసీఆర్ ఇచ్చే రూ.10 వేలకు ఆశపడి బీఆర్ఎస్‌కు ఓటు వేయవద్దన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వని కేసీఆర్‌కు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. ఐదేళ్లుగా కేసీఆర్ సర్కార్ రుణమాఫి పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. అందుకే కామారెడ్డి ప్రజలు తెలంగాణ దశ దిశను మార్చే తీర్పును ఇవ్వాలని కోరారు.


పదేళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్, ఇక్కడి ఎమ్మెల్యే మిమ్మల్ని మోసం చేశారని..   పేదలకు డబుల్ బెడ్రూంలు ఇవ్వలే, భూములకు పట్టాలు ఇవ్వలే... నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే..  కానీ ఇప్పుడొచ్చి ఆయనకు ఓటు వేయలని అడుగుతున్నారన్నారు.  పదేళ్లలో గుర్తురాని అమ్మగారి ఊరు కొనాపూర్ ఆయనకు ఇప్పుడు గుర్తొచ్చిందట.. ఏనాడూ గల్ఫ్ కార్మికులను, బీడీ కార్మికులను ఆదుకోలేదన్నారు.  సిద్దిపేట, సిరిసిల్ల కాదని కేసీఆర్ కామారెడ్డిలో పోటీకి దిగడానికి కారణం..  ఇక్కడి రైతుల భూములు గుంజుకునెందుకేనన్నారు.  ఎన్నికలున్నాయనే మాస్టర్ ప్లాన్ ను తాత్కాలికంగా రద్దు చేశారని.. ఎన్నికల తరువాత మళ్ళీ మీ భూములను గుంజుకుంటడాడని ారోపించారు.                    


కేసీఆర్ ను నమ్మదమంటే.. పాముకు పాలు పోసి పెంచినట్లేనన్నారు. కేసీఆర్ పాము లాంటి వాడు... ఓటు వేశారో.. మిమ్మల్ని కాటు వేస్తాడని హెచ్చరించారు.  కామారెడ్డి భూములను కంచె వేసి కాపాడేందుకే నేను ఇక్కడ పోటీకి దిగానని..  కేసీఆర్ గెలిచినా.. ఓడినా ఫామ్ హౌస్ లొనే పడుకుంటాడని గుర్తు చేశారు.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు.  ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని హమీ ఇచ్చారు .తెలంగాణను దోచుకోవాలంటే భయపడేలా కామారెడ్డి ప్రజలు కేసీఆర్‌కు శిక్ష విధించాలన్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.                  


 వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటామన్నారు. బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, రైతులు పండించే పంటకుగిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తామని చెప్పారు. కామారెడ్డిలో అన్ని గ్రామాలను తిరిగి మీ అందరి కష్టసుఖాలను తెలుసుకోవాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాలేకపోయాన్నారు. భవిష్యత్ కామారెడ్డిలో గ్రామగ్రామంలో పర్యటించి ప్రజలను కలుస్తానని ప్రజల కష్టాల్లో తోడుగా ఉంటాన్నారు. అందరు కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.