Revant Reddy :   హైదరాబాద్  ఓఆర్ఆర్ టోల్ టెండర్ ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే ఓఆర్ఆర్ టోల్ స్కాం వెయ్యి రెట్లు పెద్దదని  రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.  రూ. లక్ష కోట్ల ఆస్తిని కేవలం రూ.7 వేల కోట్లకు కట్టబెట్టారని విమర్శించారు. ఈ ఓఆర్ఆర్ టోల్ స్కామ్‌లో  సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పాత్రదారులు కాగా.. మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ఐఏఎస్ అర్వింద్ కుమార్ సూత్రదారులన్నారు.   హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు  టీఓటీ టెండర్లు .కనీస ధర ప్రకటించకుండా పిలిచారని..ఇది నిబంధనలకు విరుద్దమని రేవంత్ రెడ్డి అన్నారు. 


ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే పెద్ద స్కాం 


HMDA  మాస్టర్ ప్లాన్ అనుసరించి ఏ టెండరు పిలవాలన్నా 2031 లోపే పిలవాలన్నారు. కానీ ఓఆర్ఆర్ టెండరును 30 ఏండ్లకు  కట్టబెట్టారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మొదట్లో కఠిన నిబంధనలతో రూపొందించారని..అయితే కల్వకుంట్ల కవిత, ఇతర సౌత్ లీడర్ల పాలసీలో మార్పులు చేసి వందల కోట్లు దోచుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో సీఎం కేజ్రీవాల్కు రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చారన్న ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారని చెప్పారు. అయితే ఓఆర్ఆర్ టెండర్ల విషయం లక్ష కోట్లకు సంబంధించినదని.. అంత విలువైన ఆస్తిని కేవలం రూ.7,300 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. దీంతో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కాం చాలా చిన్నదని రేవంత్ పేర్కొన్నారు.


నిబంధనలకు విరుద్ధంగా 30 ఏళ్లకు టెండర్ 


దేశంలో ఎక్కడైనా 15, 20 ఏళ్లకు టెండర్లు పిలుస్తాంటారని..కానీ తెలంగాణ ప్రభుత్వం లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను 30 ఏళ్ల లీజుకు రాసిచ్చేసిందన్నారు. ఓఆర్ఆర్ టీఓటీ టెండర్ల ఒప్పందం 2023 ఏప్రిల్ 27న చేసుకున్నారని.., టెండర్లు ఆమోదించి మే 26వ తేదీకి  30 రోజులు పూర్తయ్యాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయితే  రూ.7,300 కోట్లలో 25 శాతం అంటే రూ.1800 కోట్లు ప్రభుత్వానికి IRB సంస్థ చెల్లించాల్సి ఉందని రేవంత్ రెడ్డి వివరించారు. కానీ ఇప్పటి వరకు IRB సంస్థ ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. ఈ 30 రోజుల నిబంధనపై ఐఏఎస్ అర్వింద్ కుమార్ చెబుతారని రేవంత్ నిలదీశారు


ఇప్పటికే ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఐఆర్‌బీ సంస్థ 


ఐఆర్బీ సంస్థ ఇప్పటికే ఒప్పందాన్ని ఉల్లంఘించారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  కానీ ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించడం లేదని..నిబంధనలను ఉల్లంఘించిన సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.  టెండరు నిబంధనలు మార్చి  ఉంటే ఆ విషయాన్ని అయినా చెప్పాలని నిలదీశారు. అయితే ఇంత బహిరంగంగానే దోపిడీ జరుగుతుంటే బీజేపీ నేతలు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో ఇంత పెద్ద స్కాం జరుగుతుంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారని....ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు నిర్వహించడంలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం హైకోర్టుకు సెలవులు అయినందున.. తర్వాత పిల్ దాఖలు చేస్తామని ప్రకటించారు.