ఔటర్‌ రింగ్‌ రోడ్డును సీఎం కేసీఆర్‌ పర్యవేక్షణలోనే తెగనమ్మారని తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ ఆలోచనను పదే పదే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వివరిస్తూ వచ్చిందని, ఇప్పుడు మరో దోపిడీకి తెర తీశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లో 10 శాతం చెల్లించాల్సి ఉంటుందని, అంటే రూ.7,388 కోట్లలో రూ.738 కోట్లను 30 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఇవి చెల్లించకుండా ఇంకా సమయం అడుగుతున్నారని విమర్శించారు. ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంస్థకు అనుకూలంగా ఉండేలా అధికారులపై మంత్రి కేటీఆర్ ఒత్తిడి తెస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ నెల 26వ తేదీలోగా ఐఆర్‌బీ సంస్థ నిబంధనల ప్రకారం 10 శాతం నిధులు చెల్లించాల్సి ఉందని అన్నారు. లేదంటే సంస్థకు కేటాయించిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 


దీనికి సంబంధించి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద సమాచారం అడిగామని, ఇవ్వకపోతే హెచ్‌ఎండీఏ, హెచ్‌జీసీఎల్‌ ఆఫీసులను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇప్పటిదాకా జరిగిన అవినీతిపై కాగ్, సెంట్రల్‌ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇంత దోపిడీ జరుగుతున్నా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎందుకు స్పందించడం లేదని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.


జీవో 111 ఎత్తివేతపై కోర్టుకు


111 జీవో ఎత్తివేత వెనుక ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 111 జీవో పరిధిలో కేసీఆర్ కుటుంబ సభ్యులు భూములు కొన్నారని ఆరోపించారు. భూములు కొనుగోలు చేశాక తెలివిగా జీవో ఎత్తివేశారని విమర్శించారు. 111 జీవో ఎత్తివేతకు వ్యతిరేకంగా తాము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్తామని స్పష్టం చేశారు. 2019 జనవరి తర్వాత 111 జీవో పరిధిలో భూముల క్రయ విక్రయాల వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.


కాంగ్రెస్‌లోకి ఎవరు వచ్చినా ఓకే, సర్వేల ఆధారంగానే టికెట్‌లు - రేవంత్


తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలోకి ఎవరు వచ్చినా సరే ఆహ్వానిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని అన్నారు. తన టికెట్‌తో సహా ప్రతి టికెట్‌ కు సర్వేనే ప్రామాణికంగా ఉంటుందని చెప్పారు. కర్ణాటకలో సిద్దరామయ్యకు కూడా అడిగిన టికెట్‌ కాకుండా సర్వే ఆధారంగానే మరో స్థానం నుంచి టికెట్‌ ఇచ్చారని చెప్పారు. తనతో పాటు పార్టీలో కొత్తగా చేరే వారికి కూడా ఇదే వర్తిస్తుందని చెప్పారు. గతంలో ఇన్‌ఛార్జి ఠాక్రే ఇదే విషయాన్ని చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరే అంశంపై ఇంకా స్పష్టత రాలేదని, ఆ ప్రతిపాదన వచ్చినప్పుడు చర్చ చేస్తామని అన్నారు. ఎన్నికల సమయంలో పొత్తులపై చర్చిస్తామని రేవంత్‌ రెడ్డి వివరించారు.