Revanth orders probe into leaders illegal mining allegations: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ ఇసుక , ఖనిజ తవ్వకాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. ముఖ్యంగా జూన్ 2, 2014 నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని మైనింగ్ లీజులు, అనుమతులు , అక్రమాలపై ఈ దర్యాప్తు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి పూర్తి స్థాయి నివేదికను సభ ముందు ఉంచుతామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు వంటి వారు రాజేంద్రనగర్ మండలం మానస హిల్స్ ప్రాంతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ చేస్తోందని ఆరోపించారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఆ కంపెనీతో మంత్రికి సంబంధం లేదని, కేవలం బ్లాక్‌మెయిల్ రాజకీయాల కోసమే బీఆర్ఎస్ ఈ ఆరోపణలు చేస్తోందని కొట్టిపారేశారు. అయితే, విచారణ మాత్రం నిష్పక్షపాతంగా జరుగుతుందని, అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ గండి పడిందని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయం 32 శాతం పెరిగిందని ఆయన గణాంకాలను వివరించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నిజం లేదని, అదే నిజమైతే ఇసుక అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ఎలా పెరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఇసుక రవాణాలో పారదర్శకత కోసం కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని, ఆన్‌లైన్ బుకింగ్ సమయాన్ని కూడా సవరించామని తెలిపారు. ప్రభుత్వ భూములు , ప్రకృతి సంపదను కొల్లగొట్టే వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని, సీఐడీ నివేదిక ఆధారంగా తదుపరి కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన సభకు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రల పేర్లను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్ , ఖమ్మం జిల్లాల్లో గ్రానైట్ మైనింగ్‌లో భారీ అక్రమాలు జరిగాయని, ఫెమా నిబంధనలను ఉల్లంఘించి విదేశాలకు గ్రానైట్ ఎగుమతి చేశారని ఆరోపించారు. గత పదేళ్లలో వీరు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీలను ఎగ్గొట్టడమే కాకుండా, పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కారని రేవంత్ మండిపడ్డారు. గతంలోనే గంగుల కమలాకర్ ,వద్దిరాజు రవిచంద్రలకు చెందిన గ్రానైట్ కంపెనీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేసి, సుమారు రూ. 750 కోట్ల వరకు జరిమానాలు విధించిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ జరిమానాలను వసూలు చేయకుండా వారిని కాపాడిందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు తమ ప్రభుత్వం ఆ బకాయిలను వసూలు చేయడంతో పాటు, జరిగిన అక్రమ మైనింగ్‌పై సమగ్ర విచారణ జరిపి నివేదిక సిద్ధం చేస్తుందని ప్రకటించారు. ఈ విచారణ కేవలం రాజకీయ కక్ష సాధింపు కాదని, రాష్ట్ర సంపదను కాపాడటమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. గంగుల, వద్దిరాజుల కంపెనీలతో పాటు గత ప్రభుత్వంలో మైనింగ్ లీజులు పొందిన ఇతర నేతల వివరాలను కూడా సేకరించాలని అధికారులను ఆదేశించారు. సీఐడీ దర్యాప్తులో ఈ నేతల పాత్ర రుజువైతే, మైనింగ్ లీజుల రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Raja Sekhar Allu | 28 Mar 2026 04:41 PM (IST)
Illegal mining allegations: తెలంగాణ అసెంబ్లీలో అక్రమ మైనింగ్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నేతలందరి సంస్థలపై సీఐడీ విచారణకు ఆదేశించారు.

అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం