Driving Tips: ఇండియాలో వాహనదారులకు మైలేజీ అనేది ఎప్పుడూ ఒక పెద్ద సవాలు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న తరుణంలో ప్రతి చుక్క ఇంధనం విలువైనదే. అయితే వాహనం ఇచ్చే మైలేజీ కేవలం ఇంజిన్ మీద మాత్రమే ఆధారపడదు. మన డ్రైవింగ్ అలవాట్లు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. మనకు తెలియకుండానే చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు ఇంధన వినియోగాన్ని విపరీతంగా పెంచుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Continues below advertisement

సడన్ యాక్సిలరేషన్ (Hard Acceleration)

ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఒక్కసారిగా యాక్సిలరేటర్ తొక్కడం చాలామందికి అలవాటు. ఇలా వేగంగా వెళ్లాలని చూడటం వల్ల ఇంజిన్ మీద విపరీతమైన భారం పడి ఎక్కువ ఇంధనాన్ని లాగేస్తుంది. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌లో పదే పదే ఇలా చేయడం వల్ల మైలేజీ దారుణంగా పడిపోతుంది. వేగాన్ని క్రమంగా పెంచడం వల్ల ఇంధనాన్ని ఆదా చేయవచ్చు.

తప్పుడు గేర్ వాడకం (Incorrect Gear Usage)

చాలామంది తక్కువ వేగంలో ఉన్నప్పుడు హై గేర్, లేదా ఎక్కువ వేగంలో ఉన్నప్పుడు లో గేర్ వాడుతుంటారు. దీనివల్ల ఇంజిన్ ఆప్టిమల్ రేంజ్‌లో పనిచేయదు. ముఖ్యంగా సిటీ రోడ్లపై సెకండ్ లేదా థర్డ్ గేర్‌లో ఎక్కువ సేపు ప్రయాణించడం వల్ల పెట్రోల్ ఖర్చు పెరుగుతుంది. వేగానికి తగ్గట్లుగా సకాలంలో గేర్లు మార్చడం వల్ల ఇంజిన్ స్మూత్‌గా ఉండటమే కాకుండా మైలేజీ కూడా పెరుగుతుంది.

Continues below advertisement

ఐడ్లింగ్ (Extended Engine Idling)

ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర లేదా ఎవరి కోసమైనా వెయిట్ చేసేటప్పుడు ఇంజిన్ ఆఫ్ చేయకపోవడం పెద్ద తప్పు. బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో ట్రాఫిక్ జామ్ వల్ల నిమిషాల తరబడి ఇంజిన్ ఆన్ లోనే ఉంటుంది. దీనివల్ల కారు కదలకపోయినా ఇంధనం మాత్రం ఖర్చవుతూనే ఉంటుంది. 30 సెకన్ల కంటే ఎక్కువ సేపు ఆగాల్సి వస్తే ఇంజిన్ ఆఫ్ చేయడం ఉత్తమం.

టైర్ ప్రెషర్ తక్కువగా ఉండటం (Low Tyre Pressure)

టైర్లలో గాలి తక్కువగా ఉంటే రోడ్డు మీద ఫ్రిక్ష‌న్ (Rolling Resistance) పెరుగుతుంది. దీనివల్ల వాహనం ముందుకు కదలడానికి ఇంజిన్ ఎక్కువ శక్తిని వెచ్చించాల్సి వస్తుంది. 15 రోజులకు ఒకసారైనా టైర్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి. తయారీదారులు సూచించిన మేర గాలి ఉంటే వాహనం తేలికగా కదులుతూ మంచి మైలేజీని ఇస్తుంది.

ఏసీ అతిగా వాడటం (Excessive AC Usage)

ఇండియ‌న్ వెద‌ర్ దృష్ట్యా ఏసీ వాడకం తప్పనిసరి. అయితే ఏసీని ఎప్పుడూ లోయెస్ట్ టెంపరేచర్‌లో ఉంచడం వల్ల ఇంజిన్ లోడ్ పెరుగుతుంది. కారు లోపల కావాల్సిన చల్లదనం రాగానే టెంపరేచర్‌ను సెట్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా చిన్న ఇంజిన్ ఉన్న కార్లలో ఏసీ వినియోగం మైలేజీపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ నెలవారీ పెట్రోల్ బిల్లును గణనీయంగా తగ్గించుకోవచ్చు.