Eco park Plan: కంచ గచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాలను వేలం వేయాలనుకున్న ప్రయత్నాలపై తీవ్ర ఆటంకాలు ఏర్పడుతూండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా ఆలోచిస్తోంది. వర్శిటీ స్థలాలు, కంచ గచ్చిబౌలి స్థలాల్లో జింకలు, నెమళ్లు వంటి వన్య ప్రాణాలు ఉన్నట్లుగా తేలడంతో ఆ భూముల అమ్మకంపై వెనక్కి తగ్గాలని భావిస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు సూచనలతో ఓ కమిటీని నియమించారు. భట్టి విక్రమార్క్, శ్రీధర్ బాబు కూడా అందులో సభ్యులుగా ఉన్నారు. ఈ సంప్రదింపుల కమిటీ.. తన నివేదికను, పూర్తి సమాచారాన్ని కోర్టుకు సమర్పిస్తుంది. అయితే ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను బట్టి చూస్తే.. భూముల అమ్మకం అంత తేలిక కాదని అనుకోవచ్చు. అందుకే ప్లాన్ మార్చి.. అతి  పెద్ద ఎకో పార్క్ ను నిర్మించాలని నిర్ణయించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.  వన్యప్రాణాల ఆవాసంగా సెంట్రల్ వర్శిటి, కంచ గచ్చిబౌలి స్థలాలు                  

కంచ గచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాలతో  పాటు యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన రెండు వేల ఎకరాల్లో వన్య ప్రాణులు ఉన్నాయి. నెమ్మళ్లు, జింకలు ఆవాసంగా మార్చుకున్నాయని వీడియోలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థులు కూడా యూనివర్శిటీలోకి జింకలు వస్తున్నాయని చెబుతున్నారు. యూనివర్శిటీ ఏర్పాటు  చేసినప్పుడు వేల ఎకరాలను కేటాయించారు. అప్పట్లో అదంతా నిర్మానుష్యమైన ప్రాంతం. కానీ గత మూడు దశాబ్దాల్లో ఆ ప్రాంతం అంతా ఊహించని రీతిలో అభివృద్ధి చెందింది. చుట్టూ కాంక్రీట్ అరణ్యం నిర్మితమయింది. 

ఫ్యూచర్ సిటీకి హెచ్‌సీయూ తరలింపు ఆలోచన   

 సెంట్రల్ వర్శిటీని అక్కడి నుంచి  ఫ్యూచర్ సిటీకి తరలించాలని  ప్రభుత్వం ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అక్కడ వంద ఎకరాలను కేటాయించాలని అనుకుంటున్నారు.  సెంట్రల్ వర్శిటీని ఇక్కడి నుంచి తరలించడం వ్యయప్రయాసలతో కూడుకున్నదే అయినా లంగ్ స్పేస్ కోసం.. ఎకో పార్క్ కోసం ఆ మాత్రం ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భావిస్తున్నారు.  ఫ్యూచర్ సిటీలో  వంద ఎకరాలను సెంట్రల్ వర్శిటీకి కేటాయించి..  భవనాల నిర్మాణం కోసం రూ. వెయ్యి కోట్లు ఇచ్చేందుకు  తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.                 

ప్రపంచంలోనే అతి పెద్ద ఎకో పార్క్ సెంట్రల్ వర్శిటీని తరలించి..  కంచె గచ్చిబౌలి భూముల్ని కూడా కలిపేసి అతి పెద్ద ఎకోపార్క్ నిర్మిస్తే పట్టణాల్లో ఉన్న వాటిల్లో  అది ప్రపంచం లోనే అతి పెద్ద ఎకో పార్క్ అవుతుందన్న అభిప్రాయం ఉంది. టూరిజం డెస్టినేషన్ అవుతుందని ..ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.  అన్ని రకాల జంతు, జీవ జాతులకు ప్రత్యేకంగా  ఇందులో పార్కులను ఏర్పాటు చేయవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలను ప్రజల ముందు ఉంచాలని భావిస్తున్నారు. ప్రజల్లో చర్చ పెట్టి వారి నుంచి సానుకూలత వస్తే ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి.