Telangana Weather Update | హైదరాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండలకు జనం అల్లాడిపోతున్నారు. అయితే, క్యూములోనింబస్‌ మేఘాల ప్రభావంతో ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. రానున్న 2, 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో రెండు నుంచి మూడు డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఉపశమనం కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని, తిరిగి ఈ నెల 8వ తేదీ నుంచి ఎండ తీవ్రత మళ్లీ క్రమంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Continues below advertisement

ఉత్తర, తూర్పు మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత మధ్య కురిసే ఈ అకాల వర్షాలు కొంతవరకు చల్లదనాన్ని ఇస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

హైదరాబాద్‌లో రాత్రికి వర్షం.. (Hyderabad Rains)విపరీతమైన ఎండల తీవ్రత కారణంగా వాతావరణంలో అస్థిరత ఏర్పడి, ఉరుములతో కూడిన మేఘాలు బలంగా తయారయ్యాయి. వీటి ప్రభావంతో అదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. హైదరాబాద్‌లో ఈ రాత్రి అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో నగరంలో వర్షం పడేందుకు వాతావరణం మరింత అనుకూలిస్తుంది. మే 6 లేదా 7 తేదీల్లో నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

Continues below advertisement

వచ్చే 2 గంటల్లో అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, జగిత్యాల, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురవనున్నాయి. సాయంత్రం సమయానికి సిద్దిపేట, జనగామ, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాల్లో కూడా కొన్ని తుపాను మేఘాలు ఏర్పడతాయి. ఉత్తర, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లోనేడు వర్షాలు కురుస్తున్నాయి. 

అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, జనగామ, వరంగల్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.