RangaReddy farmer stands upside down For Protest : తెలంగాణలో ధరణి పేరుతో తీసుకు వచ్చిన భూసంస్కరణ కారణంగా ఎంతో మంది రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. వారి సమస్యను పరిష్కరించడానికి అధికారులు నానా తిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదుల్లో ఇలాంటి ధరణి సమస్యలే అరవై శాతం వరకూ ఉంటున్నాయి. అందుకే తాము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని తీసేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇంకా ధరణిని రద్దు చేయలేదు. తమ భూమి విషయంలో ఏర్పడిన సమస్యల కోసం రైతులు ఇంకా ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
తమ భూమిని నిషేధ జాబితాలో చేర్చారని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతు జీవన్
తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహంపట్నం తహశీల్ దార్ కార్యాలయంలో ఓ రైతు తలకిందులుగా నిలబడి నిరసన చేపట్టారు. అప్పటికే ఎన్నో సార్లు కార్యాలయానికి వచ్చినా పట్టించుకోలేదని ఆ రైతు అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే అధికారుల మీద ఆవేశ పడితే తనకే నష్టం కాబట్టి.. వినూత్నంగా ధర్నా చేయాలనుకున్నాడు. వెంటనే తలకిందులుగా నిలబడ్డాయి. అలా దాదాపుగా గంట సేపు తన నిరసన వ్యక్తం చేశాడు. యోగాలో ఇలా నిలబడటాన్ని శీర్షాసనం అంటారు. రైతు నిరసన సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సీలింగ్ భూమి కాదని అన్ని ఆధారాలు సమర్పించినా ధరణిలో సీలింగ్ భూమిగా నమోదు
నిరసన తెలిపిన రైతు పేరు ఉన్నితాల జీవన్. ఆయన విద్యాధికుడు కూడా. హైదరాబాద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చదువుకున్నారు. జీవన్ తల్లి ఉన్నితాల జయసుధ పదిహేనేళ్ల కిందట మెట్టు సైదారెడ్డి అనే వ్యక్తి దగ్గర మంగలపల్లి గ్రామంలో ఎకరం32 సెంట్లను కొనుగోలు చేశారు. అయితే ధరణి వచ్చిన తర్వాత ఈ భూమిని నిషేధ జాబితాలో చేర్చారు. అయితే ఇది సీలింగ్ ల్యాండ్ కానే కాదని.. ప్రైవేటు ల్యాండేనని రికార్డులతో తన భూమిని నిషేధ జాబితా నుంచి తప్పించాలని ఆయన అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఎంత కాలం తిరిగినా వారి వద్ద నుంచి సమాధానం రావడం లేదు. గత ఎనిమిది నెలలుగా ఇబ్రహీనంపట్నం మండల కార్యాలయానికి.. కలెక్టర్ కార్యాలయానికి తిరుగుతూనే ఉన్నామని జీవన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎనిమిది నెలలుగా తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో వినూత్నంగా నిరసన
అది అసలు సీలింగ్ ల్యాండ్ కాదని.. గత ఐదు దశాబ్దాల భూ రికార్డులను సమర్పించినా అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం నెల రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారని కానీ ధరణి సమస్యలను పది రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశిచిందన్నారు. ఎవరూ పని చేయడం లేదని.. తప్పక నిరసన వ్యక్తం చేశామని.. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని వారు వేడుకుంటున్నారు.