Telangana Elections :  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.  ఈ సారి  కూడా మూడు రోజుల పాటు ఎర్రవెల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో యాగం నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం జరగనుంది. విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో యాగం జరుగుతోంది.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి పలువురు రుత్విక్కులు పాల్గొంటున్నారు.  మంగళవారం సాయంత్రం 200 మంది వైదికులు ఎర్రవల్లి గ్రామానికి చేరుకున్నారు. 


మొదటి రోజు సంకల్పంతో శ్రీకారం                                             


బుదవారం మొదటిరోజు తెల్లవారుజామున సంకల్పంతో శ్రీకారం చుట్టారు.  రెండో రోజు వేదపఠనం, హోమం తదితర పూజలు నిర్వహిస్తారు. చివరి రోజు పూర్ణాహుతి ఉంటుంది. తొలి రోజు హోమం ప్రారంభోత్సవంలో కేసీఆర్ దంపతులు కూడా పాల్గొన్నారు. కేసీఆర్ యాగాలు తరచూ నిర్వహిస్తూ ఉంటారు.  తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. రాష్ట్రం, ప్రజలు అభివృద్ధి చెందాలని 2015లో చండీ యాగం నిర్వహించారు. అనంతరం.. 2018 ఎన్నికల రెండో విడతకు వెళ్లకముందే సీఎం కేసీఆర్ తన ఫాంహౌస్‌లో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఆ యాగం తర్వాత ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ రెండోసారి రాష్ట్రంలో అధికారం సాధించారు. 


ప్రతి ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం               


ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ తో గులాబీ బాస్.. యజ్ఞం చేస్తున్నారు.  పూర్వ కాలంలో రాజు యుద్ధానికి వెళ్లే ముందు అర్చకులతో కలిసి రాజ శ్యామల యాగాలు, చండీ యాగాలు, శత్రు సంహార యాగాలు నిర్వహించేవారని పురోహితులు చెబుతున్నారు. శక్తి పొందడానికి, శత్రువుల బలాన్ని తగ్గించడానికి.. ప్రజలను మంత్రముగ్ధులను చేయడానికి ఈ యాగం నిర్వహిస్తున్నట్లు పండితులు వెల్లడించారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల ముందు రాజ శ్యామలా యాగం చేసి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ఎన్నికల విజయం అనంతరం సహస్ర చండీ యాగం నిర్వహించారు.             


ఇప్పటికే  తన స్వగృహంలో యాగం పూర్తి చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి                                     


బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఢిల్లీలో యాగం జరిగింది. కేసీఆర్ యాగం చేసిన ప్రతిసారీ దానికి ప్రతిఫలం దక్కుతుందని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రడ్డి కూడా ముందుగానే  రాజశ్యామల యాగం చేశారు. కొడంగల్ లోని ఆయన నివాసంలో ఈ యాగం జరిగింది.