Minister KTR : రాజన్న సిరిసిల్ల  జిల్లా సెస్ ఎన్నికల్లో బీజేపీ గుజరాత్ డబ్బులు ఎన్ని ఖర్చుపెట్టినా ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని రుజువైందని మంత్రి కేటీఆర్ అన్నారు. సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించిన సందర్భంగా మంగళవారం వినియోగదారులు, రైతులతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెస్‌ ఎన్నికల సమయంలో బండి సంజయ్‌ గుజరాత్ నుంచి రూ.5 కోట్లు తీసుకువచ్చి పంచిపెట్టారని ఆరోపించారు. డబ్బులు పంచినోళ్లే తిరిగి బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.


ఇది ట్రైలర్ మాత్రమే 


సెస్ ఎన్నికల్లో గెలవలేని వాళ్లు రాష్ట్రంలో గెలుస్తారా? అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గుజరాత్‌ డబ్బులు ఎన్ని పంచినా కేసీఆర్‌నే సీఎంను చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా రుజువు చేసిందన్నారు. సెస్ ఎన్నికల్లో మొన్న చూసింది ట్రైలరే 2023లో అసలు సినిమా చూపిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో బీజేపీని నడిపేవాళ్లు మూర్ఖులని మండిపడ్డారు. దమ్ముంటే తమకంటే ఎక్కువగా మంచి పనులు చేసి ప్రజల మనసులను గెలవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో ముందుందన్నారు.  పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేయాలన్నారు. సెస్‌ పరిధిలో ప్రత్యేక విద్యుత్‌ ప్రణాళిక రూపొందించాలని కేటీఆర్ సూచించారు.






రూ.10 చందా అయినా రాశారా? 


రాష్ట్రాల మధ్య గొడవలు పరిష్కరించలేని ప్రధాని మోదీ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపారా? మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు గొడవను కేంద్రం పరిష్కరించలేకపోయిందన్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే ఉందని గుర్తుచేశారు. 14 మంది ప్రధానులు చేసిన అప్పు మోదీ ఒక్కరే చేశారని ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కరోనా సమయంలో కుర్‌కురే ప్యాకెట్లు పంచారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు కేంద్ర నిధుల విషయంలో సవాల్‌ చేశారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.2 లక్షల కోట్లు వెళ్తే, కేంద్రం తెలంగాణకు రూ.1.68 లక్షల కోట్లు ఇచ్చిందని తెలిపారు. ఇది నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. నాలుగేళ్లలో కరీంనగర్‌కు బండి సంజయ్‌ ఏం చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్‌ చేశారు. రాజరాజేశ్వరస్వామికి కనీసం రూ.10 చందా అయినా రాయించారా? అంటూ మండిపడ్డారు. సిరిసిల్ల నుంచి విజయయాత్ర ప్రారంభించి, కరీంనగర్‌ లో గులాబీ జెండాను ఎగురవేద్దామన్నారు.  పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెంచినోళ్లు, నల్లచట్టాలు తెచ్చి రైతులను చంపినోళ్లు దేవుడట అని ప్రధాని మోదీని ఉద్దేశించి కేటీఆర్ విమర్శలు చేశారు.