హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం క్రమేపీ బలహీన పడుతోంది. దీని ప్రభావంతో రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. 24 గంటల్లో కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తాలో ఇదివరకే మోస్తరు వానలు పడుతున్నాయి. రాయలసీమ పొడిగా ఉంటున్నా, ఒకట్రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో 48 గంటల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో సగం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.


హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షం పడనుంది. బలమైన ఈదరుగాలులు సైతం వీచనున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత 24, గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు నమోదు కానుంది. వాయువ్య దిశ నుంచి 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో నగరం వైపు గాలులు వీచనున్నాయి.


తెలంగాణలో గురువారం వర్షాలతో ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో గురువారం పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ వేగంతో వీచనున్నాయి. తెలంగాణలో వర్ష సూచనతో 17 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసి, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. ఉత్తర ప్రాంతాలైన ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి ఇటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి దక్షిణ ప్రాంతాలైన రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఎల్లో వార్నింగ్ జారీ చేశారు.









శుక్రవారం ఆ ప్రాంతాల్లో వర్షాలు
అల్పపీడనం బలహీనపడినా శుక్రవారం నాడు తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచనున్నాయి. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి,  మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజల్ని అప్రమత్తం చేశారు.


ఏపీలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.. 
ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్ గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఉత్తర కొంకణ్ నుంచి దక్షిణ బంగ్లాదేశ్ వరకు ఉపరితల ద్రోణి దక్షిణ ఛత్తీస్ గఢ్ అంతర్భాగంగా విస్తరించి, ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణం వైపునకు వంగి ఉంటుంది. ఏపీలో గురువారం నాడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు యానాం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయి.






కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్సార్ జిల్లా, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో చాలాచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.