Rains In Telangana: తెలంగాణలో (Telangana) రాబోయే 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు (Rains) కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది. పశ్చిమ - మధ్య దక్షిణ బంగాళాఖాతం వద్ద సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో శుక్రవారం ఏర్పడిన ఆవర్తనం.. శనివారం నాటికి పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో ఏపీ తీరానికి చేరువగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల మధ్యలో కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఈ ప్రభావంతో తెలంగాణలోకి పశ్చిమ, వాయువ్య దిశ నుంచి గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఆవర్తన ప్రభావంతో శనివారం.. జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.


ఆదివారం.. యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. సోమవారం.. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


ఏపీలోనూ..


అటు, ఏపీలోనూ రాబోయే 2 రోజులు కొన్ని చోట్ల అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. శని, ఆది, సోమవారాల్లో ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.


Also Read: Crime News: తెలంగాణలో తీవ్ర విషాదాలు - కొడుకు ఆన్ లైన్ బెట్టింగ్‌‌తో అప్పుల పాలు, ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య