Rahul Gandhi: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే తొలి జాబితా ప్రకటించగా.. నేటి నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. జాతీయ అగ్రనేతలను ప్రచారంలోకి కాంగ్రెస్ దించింది. అందులో భాగంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలోకి దిగారు. బుధవారం ఇరువురు తెలంగాణ పర్యటనకు వచ్చారు. నేడు రామప్ప దేవాలయం నుంచి బస్సు యాత్ర ప్రారంభించనుండగా.. తొలి రోజు ములుగులో బహిరంగ సభ నిర్వహించనున్నారు.


బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు రాహుల్, ప్రియాంక చేరుకోగా.. రాష్ట్ర నేతలు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం వెంటనే బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ములుగు జిల్లాలోని రామప్ప గుడికి చేరుకున్నారు. రామప్ప దేవాలయంలో రాహుల్, ప్రియాంక ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల కార్డును దేవుడి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ పాల్గొన్నారు.


పూజలు అనంతరం తొలి విడత బస్సు యాత్రను దేవాలయం వద్ద ప్రారంభించనున్నారు. తొలి రోజు 25 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర జరగనుండగా.. రాత్రి ములుగులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభలో మహిళా డిక్లరేషన్‌ను రాహుల్, ప్రియాంక ప్రకటించనున్నారు. ఈ డిక్లరేషన్‌లో మహిళలకు పలు హామీలు ఇవ్వనున్నారు. ఇప్పటికే మహిళలకు నెలకు రూ.2,500 భృతితో పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అలాగే విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తామని తెలిపింది. వీటితో పాటు మరికొన్ని హామీలను మహిళా డిక్లరేషన్‌లో ప్రకటించనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో పురుష ఓటర్లకు సమానంగా మహిళా ఓటర్లు ఉన్నారు. దీంతో మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంలో భాగంగా వారిపై వరాల జల్లులు కురిపించనున్నారు.


నేటి నుంచి మూడు రోజుల పాటు రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొననున్నారు. ఈ యాత్రలో భాగంగా పలు వర్గాల ప్రజలతో సమావేశం కానున్నారు. అలాగే మూడు చోట్ల బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇవాళ ములుగు బహిరంగ సభ ముగిసిన తర్వాత ప్రియాంకగాంధీ తిరిగి ఢిల్లీకి వెళతారు. రాహుల్ మాత్రం ఇక్కడే ఉండి ప్రచారం నిర్వహిస్తారు. దసరా తర్వాత రెండో విడత బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనుండగా.. అప్పుడు ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహిస్తారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మూడో విడత బస్సు యాత్ర జరగనుండగా.. ఈ యాత్రలో సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే పాల్గొనేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. తొలి విడత బస్సు యాత్ర ఆరు నియోజకవర్గాల్లో జరగనుంది. ఈ యాత్రతో కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ఆరు గ్యారెంటీల పేరుతో కీలక హామీలు ప్రకటించింది. వీటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళుతుంది. దీంతో పాటు అగ్రనేతలను ప్రచారంలోకి దించుతుంది.