Priyanka Gandhi: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పోలింగ్‌కు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఆయా పార్టీల కీలక నేతలు రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. అలాగే రకరకాల హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేశారు. 6 గ్యారెంటీలకు అనుబంధంగా మరికొన్ని కీలక హామీలను కాంగ్రెస్ ప్రకటించింది.  ఇక శనివారం బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రిలీజ్ చేశారు.


రంగంలోకి ప్రియాంక గాంధీ


ప్రచారం ద్వారా పార్టీలన్నీ మేనిఫెస్టోను ప్రజల దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. జాతీయ అగ్రనేతలు కూడా ప్రచారంలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో తెలంగాణ ఎన్నికలపై ఏఐసీసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. రాహుల్ గాంధీ తరచుగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇటీవల రెండు రోజుల పాటు రాహుల్ ప్రచారం చేయగా.. ఆదివారం ప్రియాంకగాంధీ రాష్ట్రానికి రానున్నారు. ఖానాపూర్, అసిఫాబాద్‌లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖానాపూర్‌కు ప్రియాంక రానున్నారు. ఖానాపూర్‌లో గంటసేపు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆమె పర్యటనకు టీ కాంగ్రెస్ ఏర్పాట్లు చేసింది. ఒక్క రోజు ప్రచారం అనంతరం మరోసారి ప్రచారానికి ఆమె రానున్నట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే వారంలో సోనియాగాంధీ కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేసేలా కాంగ్రెస్ ప్లాన్ రూపొందించింది. కాంగ్రెస్ అగ్ర నాయకుల పర్యటనలతో హస్తం పార్టీ క్యాడర్‌లో జోష్ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ శ్రేణుల్లో ధీమా వ్యక్తమవుతోంది. నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో.. 28న సాయంత్రం ప్రచారానికి తెరపడనుంది. ఇంకా పది రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉండటంతో పార్టీలన్నీ దూకుడు పెంచాయి.


'హామీలే ప్రచారాస్త్రాలు'


ఆరు గ్యారెంటీలే తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. ఇక బీఆర్ఎస్ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతుంది. సీఎం కేసీఆర్ రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. మరోవైపు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడతామని గులాబీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంగా మారిపోతుందని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ వస్తే ధరణి రద్దు అవుతుందని, ధరణి రద్దు చేస్తే రైతుబంధు రాదనే ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా వచ్చే ఎన్నికల్లో తమ బలాన్ని చాటుకోవాలని చూస్తోంది. అందుకోసం బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఆదివారం ప్రకటించిన మేనిఫెస్టోలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లతో పాటు పలు కీలక హామీలు ప్రకటించింది. దాదాపు 20 నియోజకవర్గాల్లో బీజేపీ టఫ్ ఫైట్ ఇస్తున్నట్లు సర్వే నివేదికలు కూడా అంచనా వేస్తున్నాయి.