Modi Tweet :    తెలంగాణ‌లో కేంద్రం టెక్స్ టైల్ పార్క్ ను ఏర్పాటు చేయ‌నుంది.. ఈ మేర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. తెలంగాణకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు, లక్షలాది ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా కేంద్రం ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణతో సహా పలు రాష్ట్రాలలో టెక్స్‌టైల్ రంగాన్ని పెంచేందుకు పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలియజేశారు. తెలంగాణ‌, త‌మిళ‌నాడు, ఉత్త‌ర ప్ర‌దేశ్ , క‌ర్నాట‌క , మ‌ధ్య‌ప్ర‌దేశ్ , గుజ‌రాత్ ల‌లో మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులు రానున్నాయి. 


 ఇది ‘మేక్ ఇన్ ఇండియా’   ‘మేక్ ఫర్ ది వరల్డ్’కి గొప్ప అవకాశం


ఈ పార్కుల ద్వారా టెక్స్‌టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని, కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తుందని, లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని ఆయన ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు. “పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులు 5F (ఫార్మ్ నుంచి ఫైబర్ నుంచి ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్ నుంచి ఫారిన్ వరకు) లక్ష్యదృష్టికి అనుగుణంగా టెక్స్‌టైల్స్ రంగాన్ని పెంచుతాయి. తమిళనాడు, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఎంపీ, యూపీలలో పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు కానున్నాయని పంచుకోవడానికి సంతోషిస్తున్నాను. పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులు టెక్స్‌టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించి కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తాయి. వాటితో పాటు లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తాయి. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ మరియు ‘మేక్ ఫర్ ది వరల్డ్’కి గొప్ప ఉదాహరణ అవుతుంది.  ’ అంటూ తన ట్వీట్‌ ద్వారా తెలియజేశారు.





 


కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ కోసం నిధులు కావాలని చాలా కాలంగా కోరుతున్న తెలంగాణ ప్రభుత్వం


తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో వరంగల్లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేసింది.ఈ  మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి   నిధులు కేటాయించాలని చాలా సార్లు  మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. దీంతోపాటు ప్రాజెక్టుకు అనుమతి త్వరగా ఇవ్వాలని లేఖలో పేర్కొ్న్నారు. కాకతీయ మెగా పార్క్ వంటి భారీ ప్రాజెక్ట్‌లు సముచితంగా లబ్ది పొందేందుకు వీలుగా 'టెక్స్‌టైల్ అపెరల్ సెక్టార్ తయారీ ప్రాంతాల అభివృద్ధి   విధానాన్ని ఖరారు చేయాలని పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌లో 1200 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్‌ అయిన  కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ను అభివృద్ధి చేస్తుంది. ‘ఫైబర్ టు ఫ్యాషన్’ కాన్సెప్ట్ ఆధారంగా, అత్యాధునిక  సౌకర్యాలతో  కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ రూపుదిద్దుకుంటున్నట్టు కేటీఆర్  కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన టెక్స్ టైల్ పార్క్ ను కింద దీన్ని అభివృద్ధి చేస్తారా లేకపోతే విడిగా మరొకటి అభివృద్ధి చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.