Praneet Rao is being investigated in the phone tapping case : ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. విచారణలో తవ్వే కొద్దీ విషయాలు బయటపడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కీలక నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసిన ప్రణీత్ రావు.. ఇప్పటికే హర్డ్ డిస్కులను ఎత్తుకెళ్లి ధ్వంసం చేాడు. SIBలోని ట్యాపింగ్ డివైస్ మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు విచారణలో గుర్తించారు అధికారులు. డివైస్ ని ధ్వంసం చేసి అందులో హార్డ్ డిస్క్ మొత్తాన్ని పగలగొట్టినట్లు నిర్దారించారు. మొత్తం 42 హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసినట్లు తాజాగా అంగీకరించినట్లు తెలుస్తోంది. హార్డ్ డిస్క్ లు మరోసారి పనికి రాకుండా కట్టర్లతో పగులగొట్టినట్లు తెలుస్తోంది. దీంతో అడవుల్లో పడేసిన డివైజ్ లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రమోషన్ల ఆశచూపించి కింది స్థాయి సిబ్బందితో ప్రణీత్ రావు ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిపించారని వరంగల్ తో పాటు సిరిసిల్లలో సర్వర్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఓ బీఆర్ఎస్ నేత ఆదేశాలతోనే ఈ ట్యాపింగ్ వ్యవహారం నడిపించిన ప్రణీత్ రావు వెనుక ఓ మీడియా సంస్థ యజమాని కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో మీడియా సంస్థ యజమాని దగ్గరే ప్రణీత్ రావు ఏకంగా సర్వర్ పెట్టినట్లు అనుమానిస్తున్నారు. మీడియా సంస్థ యజమాని ఇచ్చిన సుమారు 100 నెంబర్లను సైతం ప్రణీత్ రావు ట్యాప్ చేశారని అలా సేకరించిన డేటాను 17 కంప్యూటర్ల ద్వారా ప్రైవేట్ డ్రైవ్ ల్లోకి తీసుకున్నట్లు గుర్తించారు.
ప్రణీత్ రావు డైరీ నుంచి వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లను గుర్తించిన పోలీసులు.. ఈ పని ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎవరు చెబితే చేయాల్సి వచ్చిందనే విషయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో కీలక విషయాలపై కూపీ లాగుతున్న దర్యాప్తు అధికారులు ప్రణీత్ తో కలిసి పని చేసినవారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు సీఐలను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని రహస్య ప్రాంతానికి తరలించి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వీరు నోరు విప్పితే ఎలాంటి విషయాలు బయటకు రాబోతున్నాయనేది ఆసక్తిగా మారింది.
ప్రణీత్ రావు వ్యవహారంలో ఇంటలిజెన్స్ ఉన్నతాధికారుల ప్రమేయంపైనా ఆరా తీస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో వారికీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. టెక్నికల్ ఎవిడెన్స్‌లను బయటకు తెప్పించేందుకు నిపుణుల సాయం తీసుకుంటున్నారు. త్వరలో మీడియా సంస్థ యజమానికి, కీలక బీఆర్ఎస్ నేతకూ నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రణీత్ రావు వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న విషయాలు.. రాజకీయంగా పెను సంచలనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.