Prabhakar Rao to arrive in Hyderabad in three days : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ ప్రభాకర్ రావు ఇండియాకు రానున్నారు. ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను జస్టిస్ బి.వి. నాగరత్న ,జస్టిస్ సతీష్ చంద్ర శర్మల బెంచ్ ఈ కేసును విచారించింది.
ప్రభాకర్ రావు పాస్‌పోర్టు, గతంలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పాస్ పోర్టును తిరిగి అతనికి అందజేయాలని కోర్టు ఆదేశించింది. పాస్‌పోర్టు అందిన మూడు రోజుల్లో ప్రభాకర్ రావు భారత్‌కు తిరిగి రావాలని కోర్టు ఆదేశించింది. అతను దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని, దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని సూచించింది. అదే సమయంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రభాకర్ రావును అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు తెలంగాణ పోలీసులకు ఆదేశించింది. దీంతో తాత్కాలికంగా అరెస్టు నుంచి తప్పించుకోవచ్చు. పాస్‌పోర్టు అందిన మూడు రోజుల్లో భారత్‌కు తిరిగి వస్తానని ప్రభాకర్ రావు కోర్టుకు అఫిడవిట్ రూపంలో రాతపూర్వక హామీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 5కు వాయిదా వేసింది.
సీనియర్ పోలీస్ ఆఫీసర్ అయిన ప్రభాకర్ రావు, గత భారత రాష్ట్ర సమితి (BRS) ప్రభుత్వంలో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్‌లను గా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2024 మార్చిలో పంజాగుట్ట పోలీసులు ఈ కేసును నమోదు చేసిన తర్వాత, ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు. ఏడాదిన్నరగా అమెరికాలో ఉంటున్నారు. విచారణకు సహకరించకపోవడంతో ఆయనను ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. పాస్ పోర్టు రద్దు చేశారు. డిపోర్టేషన్ ఏర్పాట్లు చేస్తున్నారు. తనకు రాజకీయ ఆశ్రయం కల్పించాలని అమెరికాలో ఆయన పెట్టుకున్న పిటిషన్లను అక్డి కోర్టులు కొట్టేశాయి. దీంతో అన్ని దారులు మూసుకుపోయినట్లయింది.
చివరికి తన పాస్ పోర్టు ఇప్పిస్తే తానే వస్తానని.. పాస్ పోర్టు ఇచ్చిన మూడు రోజుల్లో ఇండియాకు వస్తానని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఆయనకు చాన్సిచ్చింది. పాస్ పోర్టు ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. మూడు రోజుల్లో ప్రభాకర్ రావు ఇండియాకు రానున్నారు. ఇప్పటికే శ్రవణ్ రావు అనే మరో నిందితుడు కూడా ఇండియాకు వచ్చారు. అయనను పలుమార్లు ప్రశ్నించారు. వేరే కేసులో అరెస్టు చేశారు. గతంలో వీరిద్దరూ ఇండియాకు వచ్చిన మరుక్షణం కేసీఆర్ ను అరెస్టు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. వీరిని బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. ఇప్పుడు ఆ ఇద్దరిలో ఒకరు వచ్చేశారు..మరొకరు వస్తున్నారు.
ట్యాపింగ్ కేసులో అంతా.. ప్రభాకర్ రావు , కేసీఆర్ చెప్పినట్లే చేశామని..ఇతర నిందితులు చెప్పారు. చాలా కాలం అరెస్ట్ అయి వారంతా బెయిల్ పై బయటకు వచ్చారు. ఇప్పుడు ప్రభాకర్ రావు చెప్పే విషయాలు కీలకం కానున్నాయి.