Telangana Power : రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం మంగళవారం నమోదైంది. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు 14,794 మెగా వాట్ల విద్యుత్ వినియోగం అయింది. గతేడాది మార్చిలో 14,160 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం కాగా..ఈ సారి డిసెంబర్ లోనే ఆ రికార్డ్ ను అధిగమించి 14,501 మెగా వాట్ల విద్యుత్ నమోదే ఇప్పటి వరకు రికార్డ్ గా ఉంది. మంగళవారం అత్యధికంగా 14,794 మెగా వాట్ల విద్యుత్ వినియోగించడంతో కొత్త రికార్డ్ నమోదైంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో తొలిసారిగా రికార్డ్ స్థాయిలో ఇవాళ విద్యుత్ డిమాండ్ నమోదు కావటం విశేషమని ట్రాన్స్ కో సీఎండీ ప్రకటించారు.
వ్యవసాయ పనుల వల్లే కరెంట్ వినియోగం పెరిగిందనే అంచనాలు
సాగు విస్తీర్ణం పెరగడం, రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోందని ట్రాన్స్ కో అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం విద్యుత్ వినియోగంలో సౌత్ లో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ రెండో స్థానంలో ఉంది. మొత్తం విద్యుత్ వినియోగంలో 37 శాతం వ్యవసాయ రంగానికే వాడుతున్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి అత్యధిక విద్యుత్ వినియోగిస్తున్న రాష్ట్రం తెలంగాణ . డిమాండ్ ఎంత వచ్చినా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. రాబోయే రోజుల్లో కరెంటు వినియోగానికి మరింత డిమాండ్ ఉండే అవకాశం ఉందని ట్రాన్స్‌కో అధికారులు భావిస్తున్నారు.
ఎంత డిమాండ్ ఉన్నా సరఫరా చేస్తామంటున్న ట్రాన్స్ కో
పెరిగిన సాగు విస్తీర్ణం, పారిశ్రామిక అవసరాల వల్ల డిమాండ్‌కు కారణాలు పేర్కొంటున్నారు. అయితే, మొత్తం విద్యుత్ వినియోగంలో వ్యవసాయానికే 37శాతం వినియోగిస్తున్న రాష్ట్రంగా నిలిచిందని అధికారులు తెలిపారు. ఇంతకు ముందు వ్యవసాయానికే కేవలం 35శాతమే వినియోగించే వారని పేర్కొంటున్నారు. వేసవికాలం సమీపిస్తుండడంతో డిమాండ్ పెరిగి 37శాతానికి పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. తెలంగాణవ్యాప్తంగా పంటలకు నీటిని అందించడం పెరిగిందని, అలాగే ఉద్యాన పంటలకు సైతం నీటి వాడకం ఎక్కువైందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వేసవిలో విద్యుత్ కోతలనే మాట ఉండదని ప్రజలకు భరోసా
బోరుబావులపైనే ఆధారపడి రైతులు పంటలు సాగు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యుత్ డిమాండ్ ఎక్కువైందని అధికారులు పేర్కొంటున్నారు. రబీ సీజన్‌లో దాదాపు 16వేల మెగావాట్లకుపైగా డిమాండ్ వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. డిమాండ్ ఎంత వచ్చినా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. కరెంట్ కోతలు అనేవి తెలంగాణలో ఉండకూడదని ప్రభుత్వంకూడా పట్టుదలగా ఉంది.