Ponnala Lakshmaiah: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య  బీఆర్ఎస్‌లో చేరారు. జనగామలో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. పొన్నాలకు పార్టీ కండువా కప్పి సాదరంగా బీఆర్ఎస్‌లోకి కేసీఆర్ ఆహ్వానించారు. జనగామలో ప్రజా ఆశీర్వాద పేరుతో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తోంది. ఈ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొనగా.. ఈ సందర్భంగా ప్రజల సమక్షంలో పొన్నాల బీఆర్ఎస్‌లో చేరారు. 


బీఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం పొన్నాల మాట్లాడుతూ..  45 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో కష్టపడినా తనకు ఫలితం దక్కలేదని అన్నారు. బలహీన వర్గాల అభివృద్దికి కృషి చేస్తానని, కాంగ్రెస్‌లో అవమానాలకు గురయ్యానని పొన్నాల తెలిపారు.  అధికారంలోకి వచ్చిన మూణ్నెళ్లల్లోపే సకలజనుల సర్వే చేసిన ఘనత కేసీఆర్‌ది అని, ఆ లెక్కల ప్రకారమే పార్టీలు ఎన్నికలకు వెళుతున్నాయని అన్నారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను గెలిపించుకోవాలని ప్రజలకు పొన్నాల పిలుపునిచ్చారు.


పొన్నాల ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో జనగామ సీటును ఆశించారు. కానీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్‌పై అసంతృప్తితో ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో తనను అవమానించారని, బీసీ నేతలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాలను ఆయన నివానంలో మంత్రి కేటీఆర్ కలిశారు. బీఆర్ఎస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం ఆదివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను పొన్నాల దంపతులు కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌లో చేరికపై కేసీఆర్‌తో పొన్నాల చర్చించారు. ఇవాళ జనగామలో సభ ఉండటంతో కేసీఆర్ సమక్షంలో పొన్నాల బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.


పొన్నాల రాష్ట్ర విభజన తర్వాత టీపీసీసీ చీఫ్‌గా పనిచేశారు. అంతకుముందు కాంగ్రెస్ హాయంలో మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంతమంది సీనియర్లను పక్కన పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేతలను ఆయన పట్టించుకోవడం లేదని, వారితో చర్చించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత పొన్నాల కూడా కాంగ్రెస్‌లో అంత యాక్టివ్‌గా కనిపించలేదు.  కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. గతంలో నాలుగుసార్లు జనగామ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌లో జనగామ టికెట్ ఆశించినా దక్కలేదు. సర్వే ఫలితాలు, సామాజిక సమీకరణాలను అంచనా వేసుకున్న కాంగ్రెస్.. పొన్నాలకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న తనకు టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తితో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. 


పొన్నాల రాజీనామాను కాంగ్రెస్ అధిష్టానం కూడా లైట్ తీసుకుంది. ఆయనను బుజ్జగించడం లాంటి పనులు కూడా చేయలేదు. దీంతో పొన్నాల బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జనగామ బీఆర్ఎస్ అభ్యర్ధిగా పల్లా రాజేశ్వర్ రెడ్డినే కేసీఆర్ ప్రటించారు. దీంతో బీఆర్ఎస్‌లో పొన్నాల రోల్ ఏంటనేది క్లారిటీ రాలేదు.