Congress Joinings: తెలంగాణ రాజకీయాల్లో అతి త్వరలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈయనతో పాటు జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కూడా హస్తం పార్టీలోకి రాబోతున్నట్లు సమాచారం. అయితే ఈనెల 22వ తేదీన వీళ్లంతా కాంగ్రెస కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ఆయన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో జూమ్ మీటింగ్ లో మాట్లాడినట్లు సమాచారం. రాహుల్ గాంధీతో జూమ్ మీటింగ్ లోనే పొంగులేటి చేరిక తేదీ ఫిక్స్ అయింది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారట. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఈనెల 21వ తేదీన ఢిల్లీకి చేరుకుంటారు. అదే తేదీన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక జూపల్లి, పొంగులేటి చేరిక తర్వాత ఖమ్మం, పాలమూరుల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా బహిరంగ సభ నిర్వహించే యోచనలో ఉంది. 



పొంగులేటి అనుచరవర్గం అంతా కాంగ్రెస్ లోకే ! 


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి వెంట చాలామంది వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం సీనియర్ నేత, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావ్, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, మేకల మల్లిబాబు యాదవ్, రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ వెంట ఉన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా పొంగులేటి వెంట వెళ్తారని ప్రచారం జరుగుతోంది. 


జూపల్లికి సొంత బలగం - అంతా కాంగ్రెస్ లోకే


మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అచ్చంపేట, గద్వాల, నాగర్​ కర్నూల్, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, మక్తల్ నియోజక వర్గాల్లో సొంత వర్గం ఉంది.  2018 ఎన్నికల్లో బీఆర్ఎస్​ తరఫున కొల్లాపూర్ లో పోటీ చేసిన జూపల్లి..  కాంగ్రెస్​ అభ్యర్థి బీరం హర్ష వర్ధన్ ​రెడ్డి చేతిలో ఓడిపోయారు. హర్ష వర్ధన్​రెడ్డి గెలిచిన తర్వాత బీఆర్ఎస్​లో చేర్చుకోవడంలోనూ వీరిద్దరూ కీ రోల్​ పోషించారన్న టాక్​ ఉంది. తాజాగా జూపల్లి సస్పెన్షన్​కు గురి కావడంతో.. ఉమ్మడి జిల్లాలోని అసమ్మతి నేతలు ఆయనతో టచ్​లోకి వచ్చినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్​కు ఇటీవల రాజీనామా చేసిన వనపర్తి జడ్పీ చైర్​పర్సన్​ లోక్​నాథ్​ రెడ్డి, పెద్దమందడి మేఘారెడ్డి, వనపర్తి కిచ్చా రెడ్డితో జూపల్లి అనుచరులు మాట్లాడారని, తమతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నట్లుగా తెలుస్తోంది.   


బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఈ ఇరువురి నేతలతో గత కొంత కాలంగా చర్చలు జరుపుతున్నా.. ఏ పార్టీలో చేరుతున్నారనే దానిపై పొంగులేటి, జూపల్లి క్లారిటీ ఇవ్వలేదు. కానీ వీరిద్దరూ కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు కన్ఫార్మ్ అయిపోయింది.