మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ను బీఆర్ఎస్ అధిష్ఠానం సస్పెండ్ చేయడంపై ఆయన స్పందించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. జనవరి నుంచి తాను ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నానని తెలిపారు. వంద రోజుల తర్వాత అయినా బీఆర్‌ఎస్‌ నేతలు ధైర్యం తెచ్చుకొని తనను సస్పెండ్‌ చేశారని అన్నారు. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. 


బీఆర్ఎస్‌లో చేరేనాటికి తాను తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడినని గుర్తు చేసుకున్నారు. అప్పుడు టీఆర్‌ఎస్‌లోకి రావాలని ఎన్నోసార్లు ఆహ్వానించారని చెప్పారు. పార్టీలో చేరాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చి, కేటీఆర్‌ అనేకసార్లు తనతో మాట్లాడి ముఖ్యమంత్రి వద్దకు కూడా తీసుకెళ్లారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కూడా సీఎం హామీ ఇచ్చినట్లుగా గుర్తు చేశారు. సీఎం మాటలు నమ్మి తాను టీఆర్ఎస్ పార్టీలో చేరానని అన్నారు. 


తనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా కేటీఆర్ కోసమే ఉన్నానని చెప్పారు. పార్టీలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, అవమానాలు ఎదురైనా తట్టుకున్నానని అన్నారు. 2018లో ఖమ్మం జిల్లాలో ఒక సీటే గెలిచిన టీఆర్ఎస్ ఘోర ఓటమికి కారణం ఎవరో తెలుసా? అని ప్రశ్నించారు. ఖమ్మంలో సమస్యలపై తనతో ఎప్పుడైనా చర్చించారా అని అడిగారు. తప్పు అంతా వాళ్ల దగ్గర పెట్టుకొని తనపై నిందలు వేయడం ఏంటని ప్రశ్నించారు. పాలేరు ఉప ఎన్నిక జరిగిన సమయంలో గెలుపు కోసం తనపై ఒత్తిడి తెచ్చారని, అందుకోసం కేటీఆర్ ఎన్నోసార్లు తనను సంప్రదించారని అన్నారు. పాలేరు ఉప ఎన్నికను భారీ మెజారిటీతో గెలిపించుకున్నానని గుర్తు చేశారు.


అయితే, ఆరు నెలల్లో మా సార్ గురించి నీకు తెలుస్తుందని, అసలు రూపం చూస్తావని తోటి ఎంపీలు చెప్పేవారని పొంగులేటి అన్నారు. ఆరు నెలలు కాకుండానే ఐదో నెలలోనే సీఎం అసలు స్వరూపం అర్థమైందని అన్నారు. ఈ మధ్య జరిగిన తన కుమారుడి పెళ్లికి వేలాది మంది జనం తరలి రావడంతో బీఆర్ఎస్ అధిష్ఠానం ఓర్చుకోలేకపోయిందని విమర్శించారు.