బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. తాను జూలై 2 (ఆదివారం) రాహుల్ గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటానని స్పష్టం చేశారు. నేడు (జూన్ 26) రాహుల్‌ గాంధీని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహా పార్టీకి చెందిన 35 మంది కీలక నేతలు కలిశారు. ఢిల్లీ వెళ్లి వీరంతా ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. సమావేశం తర్వాత పొంగులేటి మీడియాతో మాట్లాడారు. 


బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చాక ఏ మార్గంలో వెళ్లాలనే అంశంపై అనేక మంది అభిప్రాయాలు తీసుకున్నానని పొంగులేటి చెప్పారు. జూపల్లిలో కలిసి అనేక సభలు సమావేశాలు నిర్వహించి, ప్రజలు ఏం కోరుకుంటున్నారనే అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. గత మూడు నెలలుగా సర్వేలు చేయించుకున్నామని, 80 శాతానికి పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందని అన్నారు. ఒక పార్టీ పెట్టే అంశంపై కూడా చాలా మందిని అడిగినట్లు చెప్పారు. పార్టీ పెడితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని, అలా జరగకుండా చూడాలని చాలా మంది చెప్పారని అన్నారు. తన అనుచరులు, ప్రజల అభిప్రాయం మేరకు తాను కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పదవులు ఇవ్వలేదని పార్టీ మారానని అనడం సరి కాదని అన్నారు. 


తెలంగాణ వస్తే మంచి జరుగుతుందని సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నా అనుకున్నది జరగడం లేదని, నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నారని ఆవదేన వ్యక్తం చేశారు.


కేసీఆర్ పాలన అంతా బోగస్ లే - జూపల్లి కృష్ణారావు


జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. నష్టం వస్తుందని తెలిసినా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ వెంటనే తాను నడవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. వచ్చే నెల 2న రాహుల్ గాంధీ సమక్షంలో చేరతానని వెల్లడించారు. 


 కేసీఆర్‌ నియంతృత్వ ధోరణి పరాకాష్ఠకు చేరిందని.. మంత్రుల్ని కూడా సీఎం కేసీఆర్‌ మనుషులుగా చూడడం లేదని అన్నారు. ఈ సారి కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వకపోతే ప్రజల్ని దేవుడు కూడా క్షమించడని అన్నారు. తెలంగాణ వచ్చాక తమ అంచనాలన్నీ తప్పాయని.. కేసీఆర్‌ పాలన అంతా బోగస్‌ మాటలు, పథకాలతో సాగుతోందని విమర్శించారు. ఎప్పటికప్పుడు కొత్త పథకాలతో జిమ్మిక్కులు చేస్తూ.. ప్రశ్నించే గొంతే ఉండొద్దని కేసీఆర్‌ భావిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ తీరు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కూడా అవమానించేలా ఉందని అన్నారు. దేశంలో ఎన్నడూ లేనంతగా ప్రచారానికి ప్రజల డబ్బును ఖర్చుపెడుతున్నారని జూపల్లి కృష్ణారావు విమర్శించారు.