కేసీఆర్‌ను బొందపెట్టే ఏకైక పార్టీ బీజేపీనే అని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. మాజీ ఎంపీ పొంగులేటిని బీజేపీలోకి ఆహ్వానించామని, ఆయన సానుకూలంగానే ఉన్నారని అన్నారు. పొంగులేటితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. కలిసి పనిచేసి కేసీఆర్‌ను గద్దె దించుతామని అన్నారు. పొంగులేటి, జూపల్లికి పార్టీలో సముచితమైన స్థానం కల్పిస్తామని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.
టీఆర్ఎస్ అసంతృప్త, బహిష్కృత నేతలను ఆకర్షించి వచ్చే ఎన్నికల్లో లాభం పొందే దిశగా తెలంగాణ బీజేపీ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఖమ్మం జిల్లా నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీజేపీ చేరికల కమిటీ టీమ్ భేటీపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టత ఇచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకే వారిని కలిశానని చెప్పారు. అయితే, పొంగులేటి, జూపల్లితో బీజేపీ చేరికల కమిటీ టీమ్ నేడు (మే 4) భేటీ అయిన సంగతి తెలిసిందే. వీరు దాదాపు 4 గంటలుపైగా చర్చలు జరిపారు. పొంగులేటి నివాసంలో వీరి సమావేశం జరిగింది.
అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పొంగులేటికి, జూపల్లికి టీఆర్ఎస్ పార్టీలో ఎదురైన సమస్యలు, అవమానాలు తమకు తెలుసని అన్నారు. బీజేపీలో అవన్నీ ఉండబోవని తెలిపారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ను గద్దె దించేందుకు అందరూ ఏకమయ్యేలా చూడాలని అన్నారు. మాయ మాటలతో మూడోసారి సీఎం కావాలనే ఆశ కలగానే మిగులుతుందని అన్నారు. ఏ పార్టీ వాళ్లయినా తమతో సంప్రదింపులు జరిపి, తమ పార్టీలోకి ఆహ్వానించవచ్చని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు వచ్చినా కమ్యూనిస్ట్‌లు వచ్చినా స్వాగతిస్తామని అన్నారు. బీజేపీలోకి రావాలని గతంలోనే ఢిల్లీ పెద్దలు అడిగారని పొంగులేటి గుర్తు చేశారు. కేసీఆర్ ఖమ్మంలో పోటీచేస్తే ఆయనపై కూడా పోటీచేస్తానని పేర్కొన్నారు. బీజేపీలోకి రావాలని గతంలోనే ఢిల్లీ పెద్దలు అడిగారని ప్రస్తావించారు. అయితే తాను ఏ పార్టీలో చేరతాననే దానిపై ఈ నెలాఖరుకు స్పష్టత వస్తుందని అన్నారు.