ఉద్యోగుల నోటిఫికేషన్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. డబ్బుల కోసం పరీక్షా పేపర్లను బఠాణీల్లాగా అమ్ముకున్నారని, నిరుద్యోగులకు ద్రోహం చేశారని ఆరోపించారు. అధికారులతో కుమ్మక్కై యువత జీవితంతో ఆడుకుంటున్నారని ఆక్షేపించారు. గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష చెల్లదని ఇటీవల హైకోర్టు చెప్పడం.. ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. 


తెలంగాణకు తనకు ఉన్న బంధాన్ని సోనియా గత సభలో వెల్లడించినట్లుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆమెకు అందరూ అండగా ఉంటారనే హామీ తీసుకొని వెళ్లారని అన్నారు. అభ్యర్థులు ఎవరైనా సరే మన గుర్తు హస్తం గుర్తు మాత్రమేనని చెప్పారు. ఆరు డిక్లరేషన్లను కచ్చితంగా అమలు చేస్తామని, తాము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పారు. గతంలో తాను ఇచ్చిన హామీలను మర్చిపోయి సీఎం కేసీఆర్ మాటలకే పరిమితమయ్యారని ఆరోపించారు. మరో 65 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక్కడి బీఆర్ఎస్ నేతలు వందల కోట్లు అక్రమంగా దోచుకున్నారని.. వారు ఇచ్చే అక్రమ డబ్బు తీసుకోవాలని.. కానీ, ఓటు మాత్రం కాంగ్రెస్ కే వేయాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపు ఇచ్చారు. బీఆర్ఎస్-బీజేపీ దొంగ హామీలు నమ్మి మీరు మోసపోవద్దు అని ప్రజలను ఉద్దేశించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.


కాంగ్రెస్ పార్టీ నేతల వద్ద పంచడానికి అక్రమ సొమ్ములు లేవని అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలుకు సాధ్యం కాదంటారని.. వారిచ్చే హామీలు మాత్రం అమలుకు సాధ్యమని అంటున్నారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని బతికించుకుందామని పిలుపు ఇచ్చారు. ఖమ్మం జిల్లా అంటే ఉద్యమాలకు పునాది అని.. ఖమ్మం జిల్లాలో ఉన్న 10కి 10 సీట్లను మంచి మెజారిటీతో గెలిపించాలని పొంగులేటి కోరారు. తెలంగాణలో బీఆర్ఎస్ - బీజేపీలు ప్రజల్ని మోసం చేసేందుకు సిద్ధమవుతున్నాయని అన్నారు. వారికి తగిన బుద్ది చెప్పాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసి తీరుతామని ఆయన చెప్పారు.