MLC Election Polling : ఖమ్మం – వరంగల్ – నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది. ఉప ఎన్నిక కోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 27న పోలింగ్ జరుగుతుంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 5వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో పోలింగ్ జరగనుండటంతో.. ఆయా జిల్లాల ఉద్యోగులకు సెలవు మంజూరు చేశారు.
34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటింగ్
మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోన 34 అసెంబ్లీ నియోజకవర్గాలల్లో మొత్తం 4 లక్షల 61 వేల 806 గ్రాడ్యుయేట్లు ఓటు వేయనున్నారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షా 73వేల 406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఇక, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షా 23వేల 985 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో లక్షా 66వేల 448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు.
పల్లా ఎమ్మెల్యేగా గెలవడంతో రాజీనామా
2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. శాసనసభ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో పట్టభద్రుల ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ పోరులో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ కృషి చేస్తుండగా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తమదే పై చేయి కావాలని కాంగ్రెస్ వ్యూహాలు రచించింది.
తీన్మార్ మల్లన్న కోసం మంత్రుల ప్రచారం
కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతుగా స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి ప్రేమెందర్ రెడ్డ కి మద్దతుగా కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బీజేపీ స్థానికి ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ప్రచారం నిర్వహించగా.. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి తరుపున కేటీఆర్, హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు ముఖ్యనేతలు ప్రచారం నిర్వహించారు.
సోమవారం పోలింగ్
ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో సాయంత్రం 4 గంటల నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకూ మద్యం దుకాణాలు, బార్లు మూసివేస్తారు. . అగ్ర పార్టీల ముఖ్య నేతలు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య జరుగుతుందని భావిస్తున్నారు.